తెలుగును దోషాలు లేకుండా మాట్లాడేవాళ్లు, చదివేవాళ్లు తగ్గిపోతున్నారు

తెలుగును దోషాలు లేకుండా మాట్లాడేవాళ్లు, చదివేవాళ్లు తగ్గిపోతున్నారు

తెలుగువాళ్ళలో తెలుగును ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడేవాళ్లు, తప్పులు లేకుండా చదివేవాళ్లు తగ్గిపోతున్నారు. తల్లిదండ్రుల్లో కొందరు పిల్లలకు మాతృభాషను నేర్పించడంలో తగిన శ్రద్ధ చూపించడం లేదు. మాతృభాషలో మాధుర్యముందని, ఆ మకరందాన్ని పిల్లలకు అందించవలసిన బాధ్యత మనమీద ఉందని తల్లిదండ్రులు, గురువులు గుర్తించాలి. తెలుగురాని వాళ్లకు సులభంగా తెలుగు వచ్చే విధంగా, ఆంగ్ల మాధ్యమంలో చదివి తెలుగులో తడబడే వాళ్లకు తెలుగు స్పష్టంగా చదివేలా, రాసేలా, మాట్లాడేలా 'తెలుగు బడి బాలవాచకం' అనే పుస్తకాన్ని రూపొందించాడు తెలుగుభాషోపాధ్యాయుడు కూకట్ల తిరుపతి.

ఇందులో ఓనమాలు, అచ్చులు, హల్లులు, సరళ పదాలు, వాక్యాలు, మహాప్రాణాక్షర పదాలు, వనర్డోత్పత్తి స్థానాలు, గుణింతాలు, ద్విత్వాక్షర, సంయుక్తాక్షర, సంశ్లేషాక్షర పదాలు ఉన్నాయి. అంతేకాదు మన ఆటలు, పండుగలు, జాతీయాలు, సామెతలు, పొడుపుకథలు, తెలుగు వారాలు, తిథులు, మాసాలు, ఋతువులు, కాలాలు, యుగాలు, నక్షత్రాలు, రాశులు, కార్తెలు మొదలైనవి ఉన్నాయి. తెలుగు మాతృభాషగా కలిగిన మనం తెలుగులో కనీసం నేర్చుకోదగినవన్నీ ఉన్నాయి.

“మాతృభాషలో పట్టుంటేనే అన్యభాషలు అవలీలగా వస్తాయి. పునాది బలంగా ఉంటేనే భవనం నిటారుగా నిలబడుతుంది. పిల్లలను మాతృభాషా మూలాల్లోకి తీసుకెళ్ళాలి. అపుడే స్పష్టోచ్చారణతో చదువగలుగుతారు, దోషరహితంగా రాయగలుగుతారు’’ అనే సదుద్దేశంతో కూకట్ల తిరుపతి వీడియో పాఠాలను రూపొందించాడు. పుస్తక రూపంలోనూ అందించాడు. పుస్తకంలో కూడా దాదాపు ప్రతి పేజీలో క్యూ. ఆర్. కోడ్ ను పొందుపరిచాడు. దానిని సెల్ ఫోన్ తో స్కాన్ చేయగానే నేరుగా యూట్యూబ్ పాఠంలోకి తీసుకెళుతుంది. ఇందుకు కూకట్ల తిరుపతి, ఈ కృషిలో అతనికి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పిన, అక్షర ముఖచిత్రాన్ని వేసిన అతని కుమారుడు సాయి భారవి (బి.టెక్. కంప్యూటర్ సైన్స్) అభినందనీయులు.

తెలుగు నేర్చుకోవడంలో పిల్లలకు, నేర్పడానికి గురువులకు ఉపయుక్తమైన గ్రంథమిది. ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రంథాలయంలో, ప్రతి ఇంటా ఉండదగిన పుస్తకమిది.
- ఎ. గజేందర్ రెడ్డి 9848894086