భారత్ బ్రాండ్ రైస్​పై ఇంట్రెస్ట్ చూపని జనం

 భారత్ బ్రాండ్ రైస్​పై ఇంట్రెస్ట్ చూపని జనం
  •  భారత్ బ్రాండ్ రైస్​పై ఇంట్రెస్ట్ చూపని జనం
  • ఒకసారి కొనుగోలు చేశాక మళ్లీ కొనట్లేదు 
  •  విక్రయ కేంద్రాలు సిటీలో చాలా తక్కువే 
  • రిలయన్స్ ​మార్ట్, కొన్ని ఔట్​లెట్​ల్లోనే లభ్యం
  • ఈ – కామర్స్ ఫ్లాట్ ఫామ్స్ లో  దొరకడంలేదు

హైదరాబాద్​, వెలుగు:  బహిరంగ మార్కెట్ లో రోజురోజుకు పెరిగిపోయే  బియ్యం, నిత్యావసరాల ధరలను దృష్టిలో పెట్టుకొని కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భారత్​బ్రాండ్​రైస్ పై జనాలు పెదవి విరుస్తున్నారు.  మార్కెట్​లో  కిలో రూ. 29 కే అమ్ముతుండగా బియ్యం దొడ్డుగా ఉంటున్నాయని, వండిన తర్వాత అన్నం ముక్కవాసన వస్తుందని పేర్కొంటున్నారు. ఒకసారి కొనుగోలు చేసినవారు  మరోసారి తీసుకునేందుకు ఆసక్తి చూపించడంలేదు. ​రైస్​అమ్మకాలపైనా.. అవి ఎక్కడ దొరకుతాయనేది కూడా చాలామందికి తెలియడంలేదు. ఈ స్కీమ్ ను అమల్లోకి తెచ్చేందుకు విస్తృతంగా ప్రచారం చేసిన కేంద్రం పంపిణీ మాత్రం సరిగా చేయడంలేదు. గత ఫిబ్రవరి 7న నుంచి భారత్​ రైస్​ ను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి తెచ్చింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కేంద్రం తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. 

సామాన్యులకు అందుబాటులో ఉండాలని..

ఓపెన్​ మార్కెట్లో బియ్యం ధరలు  ప్రస్తుతం ప్రీమియం క్వాలిటీ రైస్ కిలో​రూ.60 పలుకుతుంది. దీంతో సామాన్యులకు అందుబాటులో ఉండడంలేదు. మంచి బియ్యం అందించాలనే ఉదేశంతో కిలో రూ. 29కే కేంద్ర ప్రభుత్వం భారత్​ రైస్​ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అదేవిధంగా భారత్‌‌ గోధుమ పిండి, శనగ పప్పు కూడా అమ్ముతుండగా.. ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నిత్యవసరాల్లో ఎక్కువగా వాడే వంట నూనె, నాణ్యమైన  బియ్యం, కంది పప్పు వంటివి కూడా భారత్​ బ్రాండ్​ ద్వారా తక్కువ ధరలకు అందించాలని జనం కోరుతున్నారు. 

ఎక్కడ అమ్ముతున్నరో తెలియట్లేదు

భారత్ బ్రాండ్​సరుకులను అమ్మే బాధ్యతను నేషనల్‌‌ అగ్రికల్చరల్‌‌ కో – ఆపరేటివ్‌‌ మార్కెటింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(నాఫెడ్‌‌), నేషనల్‌‌ కో – ఆపరేటివ్‌‌ కన్స్యూమర్ ఫెడరేషన్‌‌ ఆఫ్ ఇండియా(ఎన్‌‌సీసీఎఫ్‌‌), కేంద్రీయ భండార్‌‌ వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. సిటీలో మాత్రం ఎక్కడో ఒక చోట ఇవి దొరుకుతున్నాయి. కొన్ని రిలయన్స్​మార్ట్​ల్లో, ఇంకొన్ని ఔట్​ లెట్లలో మాత్రమే వీటిని అమ్ముతున్నట్టు  ప్రజలకు తెలియడం లేదు. మరికొన్ని స్టోర్లలో భారత్​దాల్, భారత్​అట్టామాత్రమే లభిస్తున్నాయి. ఇలా భారత్​ బ్రాండ్​సరుకులను  ప్రైవేట్​స్టోర్లలో కాకుండా రేషన్​షాపుల ద్వారా అందిస్తే సామాన్యులకు అందుబాటులో ఉంటాయని ప్రజలు కోరుతున్నారు. కేంద్రం కూడా ఆన్​లైన్​లో కూడా వీటి విక్రయాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పటివరకు అమెజాన్, ఫ్లిఫ్​కార్ట్, జియో మార్ట్ ఈ– కామర్స్​ఫ్లాట్​ఫామ్స్ లోనూ దొరకడంలేదు. 

అన్నం మంచిగా ఉంటలే 

వారం కిందట భారత్​ బ్రాండ్​ రైస్​కొనుగోలు చేశా.  బియ్యం చూస్తే సన్నగా కనిపిస్తున్నాయి. కానీ వండిన తర్వాత అన్నం దొడ్డుగా ఉంటుంది. అన్నం కూడా ముక్క వాసన వస్తుంది. కేంద్రం  ఇస్తుంది కదా.. బాగానే ఉంటాయనుకోగా.. ఊహించినతంగా లేదు.  – టి.రాఘవేందర్​, ప్రైవేట్​ఎంప్లాయ్, లంగర్​హౌజ్

రేషన్ బియ్యంతో పోల్చుకుంటే  వ్యత్యాసం ఉంటది

20 రోజుల నుంచి భారత్​బ్రాండ్​రైస్​ను తెలంగాణలో ఇస్తున్నం. సిటీలో మొత్తం 26 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. 5 వేల మెట్రిక్​ టన్నుల పంపిణీ చేయాల్సిఉండగా వెయ్యి వరకే ఇచ్చాం. త్వరలో టార్గెట్​ను పూర్తి చేస్తం. అన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించే బియ్యాన్ని సరఫరా చేస్తున్నం. రేషన్​బియ్యాన్నే పాలిష్​ చేసి ఇస్తున్నం.  కానీ చాలా వ్యత్యాసం ఉంటది. రేషన్​బియ్యంలో 25శాతం నూక ఉంటుంది. భారత్​రైస్​ లో ఉండదు. రైస్​ దొడ్డుగా ఉంటున్నాయనే కంప్లయింట్స్ రాలేదు. వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
 – వినయ్​కుమార్, నాఫెడ్​హెడ్​ తెలంగాణ, ఏపీ