నవాబుపేట,వెలుగు: ఉచిత ప్రయాణం ఇష్టం లేని వారు డబ్బులిచ్చి టికెట్ కొనుక్కోవచ్చని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరు లో చింతలపూడి మఠం ముఖ ద్వారాన్ని ఎమ్యెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, రాజేశ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రెండు గ్యారంటీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమని, ఫ్రీగా ప్రయాణించడం ఇష్టం లేనివారు టికెట్ తీసుకోవచ్చన్నారు. బీజేపీ రాముడి బొమ్మతో రాజకీయాలు చేస్తుంటే, మరోవైపు పనిపాట లేని బీఆర్ఎస్ నాయకులు జనాలను రెచ్చగొడుతూ నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మండల పార్టీ అధ్యక్షుడు నీరటి రాంచంద్రయ్య, బంగ్లరవి, ఖాజా, ఎంపీటీసీ తుల్సిరాం నాయక్, వెంకటేశ్‌గౌడ్, కృష్ణయ్య, భూపాల్‌రెడ్డి, వాసుయాదవ్ పాల్గొన్నారు.