వానలు కురవలే .. గ్రౌండ్​ వాటర్​ పెరగలే

వానలు కురవలే .. గ్రౌండ్​ వాటర్​ పెరగలే
  • ఆందోళనలో ఉమ్మడి పాలమూరు రైతులు


వనపర్తి, వెలుగు: జూన్​ రాగానే వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. వాతావరణం చల్లబడినా ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడంతో భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మే నెలలోనే దుక్కులు చేసుకున్న రైతులు జూన్​లో తొలకరి కోసం ఎదురుచూశారు. ఆశించిన స్థాయిలో వానలు కురవక జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా అంతంతమాత్రంగానే ఉంది.

వనపర్తి జిల్లాలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రెండు సీజన్లలో సాగు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వానాకాలంలో భూగర్భజలాలు అడుగంటడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  నిరుడు ఇదే నెలతో పోల్చుకుంటే జిల్లాలో భూగర్భజలాలు 1.70 మీటర్ల మేర పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 

10 శాతం దాటని సాగు..

వనపర్తి జిల్లాలో వానాకాలంలో 2.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. కానీ, ఈసారి ఖరీఫ్​లో సాగు విస్తీర్ణం 10 శాతం కూడా దాటలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 9,243 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ లెక్కల ప్రకారం పత్తి పంట 5,159ఎకరాల్లో సాగవగా, 500 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే బోరుబావుల కింద నారుమడులు వేసుకున్న రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. వానలు కురిస్తే నాట్లేసుకోవచ్చని ఆశిస్తున్నారు. నారు ముదిరి పోతుందని రైతులు వాపోతున్నారు. మూడు రోజులుగా వర్షం కురుస్తున్నా పంటలకు పెద్దగా ఉపయోగపడదని అంటున్నారు.

యాసంగితోనే అడుగంటాయా?

యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలని అగ్రికల్చర్, ఇరిగేషన్​ ఆఫీసర్లు సూచించారు. అయినా జిల్లాలో కేఎల్ఐ కాల్వల కింద భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో మూడేండ్లుగా వరి రెండు కాలాల్లో వేస్తున్నారు. యాసంగిలో వరి పంట వేయగా, జూరాల ఆయకట్టు కింద నీరందకపోయినా, బోరు బావుల కింద సాగు చేశారు. దీంతో భూగర్భజలాలు కొంత మేర పడిపోయాయి. ఫలితంగా వానాకాలంలో రైతులు వానల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. దీనికితోడు వాగులు, వంకల నుంచి ఇష్టారీతిగా ఇసుక అక్రమంగా తోడేస్తుండడం కూడా భూగర్భ జలాలు పడిపోడానికి కారణమని అధికారులు పేర్కొంటున్నారు. 

ఎక్సెస్​ వర్షం ఉన్నా ఉపయోగం లేదు..

వనపర్తి జిల్లాలో జులై 15 వరకు సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువే నమోదైంది. జిల్లా సాధారణ వర్షపాతం 139.2 మి.మీలు కాగా, 246 మి.మీలు కురిసి 77శాతం ఎక్సెస్​ నమోదైంది. అయినా పంటలకు పెద్దగా ఉపయోగపడడం లేదని అంటున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే వానాకాలం పంటలు సక్రమంగా సాగవుతాయని రైతులు చెబుతున్నారు.

వనపర్తిలోనే తక్కువ అడుగంటినయ్..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిన వాటిలో ఒక్క వనపర్తి జిల్లాలోనే తక్కువగా పడిపోయాయి. వనపర్తిలో 7.10 మీటర్లకు జలాలు పడిపోగా, జోగులాంబ గద్వాలలో 7.95 మీటర్లు, నారాయణపేటలో 9.65 మీటర్లు, నాగర్​కర్నూలులో 10.15 మీటర్లు, మహబూబ్​నగర్​లో 11.88 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి.