- పశువులను నిర్లక్ష్యంగా వదిలేస్తున్న యజమానులు
- పగటిపూట ట్రాఫిక్ తిప్పలు.. రాత్రివేళల్లో యాక్సిడెంట్లు
- గాయాలపాలై, వాహనాలు చెడిపోయి అర్థికంగా నష్టం
- పశువుల సంచారాన్ని కంట్రోల్ చేయాలంటున్న ప్రజలు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని రోడ్లపై ఎక్కడ చూసినా మూగజీవాల మందలే కనిపిస్తున్నాయి. మెయిన్ రోడ్లతో పాటు చౌరస్తాలు పశువులు సంచారానికి అడ్డాలుగా మారాయి. అవి రోడ్లపై అడ్డదిడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. పార్కింగ్ ప్రదేశాలనూ ఆక్రమిస్తున్నాయి. వచ్చిపోయే వారిని పొడుస్తున్నాయి. వీటివల్ల తరుచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తోపుడు బండ్ల చిరు వ్యాపారులు పశువుల తాకిడితో విక్రయాలు జరుపుకోలేని పరిస్థితి ఏర్పడింది.
మెయిన్ రోడ్లపైనే మందలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లతో పాటు నేషనల్ హైవేలపై పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, ఐబీ చౌరస్తా, ఓవర్ బ్రిడ్జి, చున్నంబట్టివాడ, పాత మంచిర్యాల, మార్కెట్ ఏరియాల్లో పశువులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట రోడ్లో వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట వరకు, ఇటు చెన్నూర్ రోడ్లో సీసీసీ, శ్రీరాంపూర్, జైపూర్, భీమారం, బెల్లంపల్లి రోడ్లో బొక్కలగుట్ట, మందమర్రి, బెల్లంపల్లి, బోయపల్లి, ఐబీ తాండూర్ ఇలా పలు ప్రాంతాల్లో మూగజీవాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిల్లో కొన్ని వాహనాల శబ్ధానికి బిత్తరపోయి ఒక్కసారిగా చెల్లాచెదురవుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పశువుల సంచారంతో పగటిపూట ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండగా, రాత్రివేళల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
పట్టించుకోని అధికారులు
పట్టణ ప్రాంతాల్లోని కొంతమంది యజమానులు పశువులను నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. రాత్రిపూట ఇండ్లలో కట్టేసుకోకుండా వాటిని విడిచిపెట్టడంతో అవి రోడ్లనే అడ్డాలుగా మార్చుకుంటున్నాయి. గ్రామాల్లో సైతం కొంతమంది యజమానులు ఇలాగే వ్యవహరిస్తున్నారు. ప్రమాదవశాత్తూ వాహనాలు తాకి గాయపడితే మాత్రం నానా హంగామా చేస్తున్నారు. గతంలో పాత మంచిర్యాల, వేంపల్లి మధ్య వాహనదారులు పశువులను ఢీకొని చనిపోయారు. బెల్లంపల్లి ప్లై ఓవర్ దగ్గర రోడ్డు దాటుతున్న గేదెను ఓ కారు ఢీకొంది.
ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కాగా, అందులో ఉన్నవారికి గాయాలయ్యాయి. ఇటీవల చున్నంబట్టివాడలో ఓ వ్యక్తి పశువులను ఢీకొని హాస్పిటల్ పాలయ్యాడు. ఇల్లా రోడ్లపై నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లపై పశువుల సంచారాన్ని కంట్రోల్ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. పశువులను కట్టేసుకోకుంటే చర్యలు తీసుకుంటామని, యజమానులపై కేసులు పెడుతామని ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
వాహనాలపై దుంకుతున్నయ్..
మంచిర్యాల చున్నంబట్టివాడ మెయిన్ రోడ్డులోని రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర ఎప్పుడు చూసినా పశువుల మందలు కనిపిస్తున్నాయి. వాహనాలపై దుంకుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి. రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాళ్లను పొడుస్తున్నాయి. పశువుల సంచారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
జి.సతీశ్‌కుమార్,చున్నంబట్టివాడ
కారు రిపేర్‌కు రూ.70వేలు ఖర్చయ్యింది
ఇటీవల నేను పనిమీద ఐబీ తాండూర్‌కు వెళ్లి రాత్రి 10 గంటల ప్రాంతంలో వస్తుండగా బెల్లంపల్లి ఫ్లై ఓవర్ వద్ద గేదె ఎదురుగా వచ్చింది. రోడ్డుపై సరైన లైటింగ్ లేకపోవడంతో గేదెను ఢీకొనడంతో కారు డ్యామేజీ అయ్యింది. గాయాలతో బయటపడ్డాం. కారు రిపేర్‌కు రూ.70వేలు ఖర్చయ్యాయి. –పి.సాయికుమార్, మంచిర్యాల