
ఫుడ్ వ్లాగర్ ఎబ్బిన్ జోస్ రకరకాల ఫుడ్‌ని ఆస్వాదిస్తూ.. తనకు బాగా నచ్చినదాన్ని అందరితో పంచుకుంటున్నాడు. తన వీడియోలో నవ్వుతూ ‘నమస్కారం’ అంటూ వీడియో మొదలుపెడుతుంటాడు. ఆ నవ్వు కోసం, ఆయన మాటల కోసమే వీడియోలు చూసేవాళ్లు కూడా ఉంటారు. కంటెంట్ కోసం జోస్ ఎప్పుడూ మరొకరిని బాధపెట్టే పని చేయడు. అందుకే ఆయనకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ట్రావెలింగ్ మీద ఇష్టంతో...
ఎబ్బిన్ జోస్ కేరళకు చెందిన ఫేమస్ ఫుడ్ వ్లాగర్, ఫిల్మ్ మేకర్, యూట్యూబర్. 1977లో కేరళలోని చంగనస్సేరిలో పుట్టాడు. ‘సేక్రేడ్ హార్ట్’ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. చంగనస్సేరిలోనే ఎస్బీ కాలేజీలో ప్రి–డిగ్రీ చేశాడు. తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.
లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు.
తర్వాత మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ విభాగానికి వెళ్లాడు. చదువు పూర్తయ్యాక కొద్దికాలం బెంగళూరులో, తర్వాత నేపాల్‌లో పనిచేశాడు. ఆ తర్వాత ఆఫ్రికా వెళ్లాడు. అక్కడే దాదాపు పదిహేడేండ్లు పనిచేశాడు. 2016లో కేరళకు తిరిగొచ్చాడు. ఆ తర్వాత కేరళలో ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. కానీ.. అంతగా కలిసి రాకపోవడంతో తక్కువ టైంలోనే మూసేశాడు. ప్రస్తుతం ఎర్నాకులంలో ఉంటున్నాడు. చిన్నప్పటినుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే ఉద్యోగం చేస్తూనే ఖాట్మండు, మొగదిషు, సోమాలియా, ఇథియోపియా, ఉగాండా, ఈజిప్ట్, ఇండియాలో దక్షిణాది, ఈస్ట్ ఇండియా, ఈస్ట్ ఆఫ్రికా మొదలైన ప్రాంతాల్లో పర్యటించాడు.
ఫుడ్ వ్లాగింగ్
జోస్ దాదాపు ఐదేండ్లుగా పల్లెటూరి రుచులను, అందాలను యూట్యూబ్ ద్వారా పంచుకుంటున్నాడు. వాస్తవానికి ఆయన యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ చేయాలి అనుకున్నాడు. కానీ.. స్థానికంగా దొరికే ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనే అతన్ని ఫుడ్ వ్లాగర్‌ని చేసింది. ఇప్పుడు ఫుడ్ వ్లాగ్స్‌తోపాటు.. కొత్త ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్ చేస్తూ.. వివిధ రకాల కల్చర్స్‌ని చూపిస్తున్నాడు. ఆ వీడియోలను తన ఛానెల్ ‘ఫుడ్ ఎన్ ట్రావెల్ బై ఎబ్బిన్ జోస్’లో అప్‌లోడ్ చేస్తున్నాడు. దీన్ని 2018 జనవరి 26న మొదలుపెట్టాడు. ప్రస్తుతం 7 లక్షల 35 వేల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 931 వీడియోలను అప్‌లోడ్ చేశాడు. ఆయన చేసిన కొన్ని వీడియోలకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.
మొదట్లో ఇబ్బందులు
వాస్తవానికి ఛానెల్ పెట్టిన కొత్తలో జోస్ కొంత ఇబ్బంది పడ్డాడు. పెద్దగా వ్యూస్ వచ్చేవి కావు. అయినా.. జోస్ నిజాయితీగా ఉండేవాడు. తనకు ఫుడ్ నచ్చితేనే ఆ వీడియోను అప్‌లోడ్ చేసేవాడు. లేదంటే.. ఆపేసేవాడు. అది చిన్న టీ షాప్ అయినా, ఫైవ్ స్టార్ రెస్టారెంట్ అయినా తనకు ఫుడ్ నచ్చకపోతే.. వెంటనే వాళ్లకు ‘నచ్చలేదు’ అని మొహమాటం లేకుండా చెప్తాడు. అంతేకాదు.. తనకు ఎందుకు నచ్చలేదో అది కూడా వాళ్లకు చెప్తాడు. అలా చెప్పడం దేనికి అని అతన్ని అడిగితే.. ‘దానివల్ల వాళ్లు బాగుపడితే మంచిదే కదా?’ అంటాడు.
కానీ.. చాలా మంది వ్లాగర్లు దీనికి భిన్నంగా ఉంటారు. కంటెంట్ కోసం ఫుడ్ ఎలా ఉన్నా వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పటివరకు జోస్‌కు ఫుడ్ నచ్చకపోవడంతో చాలా ప్లేస్‌ల నుంచి వీడియో షూటింగ్ చేయకుండానే తిరిగి వచ్చేశాడు. ఏదైనా బాగుంటేనే అందరికీ చెప్పాలి అంటాడు.
మార్క్ వీన్స్
జోస్ ఎప్పుడూ ఫుడ్‌కి రివ్యూ ఇవ్వడు. ఎందుకంటే.. తనకు ఫుడ్ రివ్యూ చేసే అర్హత లేదంటాడు. అందుకే ఫుడ్ టేస్ట్ ఆస్వాదించి.. అదే విషయాన్ని ఇతరులకు చెప్తాడు. అయితే..ఈ అలవాటు అతనికి చిన్నప్పటి నుంచే ఉంది. పదిహేడేండ్ల వయసు నుంచే జోస్ రుచులను ఆస్వాదిస్తున్నాడు. అప్పటినుంచే టీవీల్లో వచ్చే ఫుడ్ ప్రోగ్రామ్స్ చూసేవాడు. ఇథియోపియాలో ఉన్నప్పుడు మార్క్ వీన్స్ ప్రోగ్రామ్స్ చూడటం మొదలుపెట్టాడు. వీన్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమెరికన్ ఫుడ్, ట్రావెల్ వ్లాగర్. అతను ఒక వీడియోలో ఇండియాకు రావాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పాడు. దాంతో వెంటనే అతనికి కేరళకు రావాలని కోరుతూ ఒక ఇ–మెయిల్ పంపాడు జోస్. కానీ.. వీన్స్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పటికి జోస్ ఫుడ్ వ్లాగ్స్ మొదలుపెట్టలేదు. తర్వాత ఆఫ్రికా నుండి తిరిగి వచ్చి కేరళలో స్థిరపడి వ్లాగ్స్ మొదలుపెట్టాక వీన్స్ నుంచి మెయిల్ వచ్చింది.
2019లో ఒక రెస్టారెంట్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అతనికి ఒక ఇ–మెయిల్ వచ్చింది. చూస్తే.. అది వీన్స్ నుండి వచ్చింది. ‘వారం రోజులు కేరళలో ట్రావెల్ చేసి, నీతో పాటు ఫుడ్ టూర్‌కు వెళ్లాలి అనుకుంటున్నా’ అనేది ఆ మెయిల్ సారాంశం. అయితే.. వాస్తవానికి జోస్ పంపిన మెయిల్‌ని చూసి వీన్స్ రిప్లై ఇవ్వలేదు. విషయం ఏంటంటే.. నిజానికి కేరళకు వెళ్లాలి అని వీన్స్ అనుకున్నప్పుడు కేరళలోని బెస్ట్ ఫుడ్ వ్లాగర్స్ గురించి వెతికాడు. అలా జోస్ వ్లాగ్స్ పని నచ్చి మెయిల్ చేశాడు. తర్వాత కొన్నాళ్లకు వీన్స్, అతని భార్య, స్నేహితుడితో వచ్చి ఒక ట్రావెలర్ వ్యాన్‌లో వారం పాటు కేరళలోని కన్నూర్, అలప్పుజా, కొట్టాయం, తిరువనంతపురం జిల్లాల మీదుగా ఫుడ్ ట్రావెల్ చేశారు.
వీన్స్‌తో ప్రయాణం
వీన్స్‌తో కలిసి ట్రావెల్ చేయడం మరువలేని జ్ఞాపకం అంటాడు జోస్. అతను వీన్స్‌తో కలిసి కేరళలోని చాలా ప్రాంతాలు తిరిగాడు. ముఖ్యంగా మలబార్ రుచులు చూశాడు. గ్రామీణ ప్రాంతాల్లోని కల్లు దుకాణాల్లో దొరికే చిరుతిళ్లను ఎక్స్‌పీరియెన్స్ చేశాడు. అనేక రకాల గిరిజన వంటకాల గురించి కూడా ఈ ట్రిప్‌లోనే జోస్‌కి తెలిసింది. అయితే.. కేరళకు చేరుకోవడానికి ఒక రోజు ముందు వీన్స్ ఒక వ్లాగ్‌లో మాట్లాడుతూ.. కేరళలో ఒక పెండ్లిని కవర్ చేయాలి అనుకున్నట్టు చెప్పాడు. వీన్స్ కోసం జోస్ చాలా ప్లాన్ చేసినప్పటికీ అప్పటికప్పుడు పెళ్లి చేసుకోబోయే జంటను వెతకడం కష్టం కదా! అయినా.. తనవంతు ప్రయత్నం చేద్దామని డిసైడ్ అయ్యాడు. కేరళ వచ్చినప్పుడు వీన్స్ కన్నూర్‌లోని సీషెల్‌లో ఉన్నాడు.
అందుకే అక్కడే ఉంటున్న హారిస్‌కి వీన్స్ కోరిక గురించి చెప్పాడు. కానీ.. జోస్ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే.. అదృష్టం కొద్దీ అదే ప్రాంతంలో ఒక గృహప్రవేశం వేడుక జరుగుతుందని జోస్‌కి తెలిసింది. ఆ కుటుంబంతో మాట్లాడితే.. వాళ్లు తెలిసిన వాళ్ల పెండ్లికి తీసుకెళ్లి వీడియో షూటింగ్ చేసేందుకు సాయం చేశారు. ఆ తర్వాత కోహికోడ్‌లోని అమ్మ హోటల్, త్రిస్సూర్‌లోని భారత్ హోటల్ రుచులు చూసిన తర్వాత మలబార్ మీదుగా అలప్పుజా, తిరువనంతపురం వెళ్తూ రుచికరమైన వంటకాలను కవర్ చేశారు. అక్కడి నుంచి టాపియోకా అనే ట్రెడిషనల్ బిర్యానీ, ట్రెడిషనల్ చేపల కూర కోసం కొట్టాయంకు వెళ్లారు. అలా... ఫుడ్ టూర్ పూర్తయింది.
ఎప్పుడు? ఎక్కడికి వెళ్లాలి? అనేది పక్కాగా ప్లాన్ చేసుకుని మరీ టూర్ పూర్తిచేశారు. ఈ టూర్ వల్ల వీన్స్‌కి కేరళ చాలా బాగా నచ్చేసింది. అందుకే అతను బ్యాంకాక్‌లో ఉన్నప్పుడు కేరళలో దొరికే ‘కుడంపులి చేపల కూర’ను తయారు చేయడానికి ట్రై చేశాడు. అంతేకాదు.. ఆయనతో జోస్ ఉన్న వీడియోలు చూసి చాలామంది విదేశాల నుంచి జోస్‌కు ఫోన్ చేశారు. ఈ వీడియోల వల్ల కేరళ టూరిజంకు ఒక గుర్తింపు వచ్చిందనే చెప్పొచ్చు.
రచయిత కూడా..
జోస్ రచయిత కూడా. అతను ‘ది ఆర్డీల్’ అనే పుస్తకాన్ని రాశాడు. ఇంగ్లిష్‌లో రాసిన ఈ బుక్‌లో మిస్టరీ, ష్టార్ట్, ఫిక్షన్, డిటెక్టివ్ స్టోరీలు ఉన్నాయి. ఇది 24 ఆగస్టు 2011న పబ్లిష్ అయ్యింది. ‘ది హోరోస్కోప్’ పేరుతో మరో పుస్తకం కూడా రాశాడు. ఇందులో ఫిక్షన్ స్టోరీస్ ఉన్నాయి.
ఎందుకలా?
ఎందుకంత ముక్కుసూటిగా ఉంటావని జోస్‌ని ఎవరైనా అడిగితే.. చాలామంది గూగుల్‌లో పాజిటివ్ రివ్యూలు చూసి ఫుడ్ తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్తారు. తీరా వెళ్లి తిన్న తర్వాత ఫుడ్ బాగాలేకపోతే.. చాలా బాధగా అనిపిస్తుంది. దీనంతటికీ కారణం.. నచ్చని వాళ్లు బాగాలేదని చెప్పలేకపోవడమే. అలా చెప్పి ఉంటే.. ఆ రెస్టారెంట్ వాళ్లు బాగా వండడానికి ట్రై చేసేవాళ్లు. అందుకే నాకు నచ్చకపోతే వెంటనే అక్కడే చెప్తా. ఒకవేళ ఫుడ్ బాగుంటే.. ఆ విషయం నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా. ముఖ్యంగా పిల్లలు కూడా నా వీడియోలు చూస్తారు. పైగా పెద్దలు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. ఏది చెప్తే అదే నమ్ముతారు. అలాంటప్పుడు వాళ్లకు నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా! పిల్లలకు ఈజీగా అర్థం కావాలనే నేను సివిలైజ్‌డ్ లాంగ్వేజ్‌లో చెప్పడానికి ట్రై చేస్తుంటా.