మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటే ప్రజలు ఊరుకోరు : కోమటిరెడ్డి

ప్రభుత్వ వైఖరి, సీఎం కేసీఆర్ కుటుంబ స్వార్థం వల్ల  వాళ్లకు సంబంధించిన మనుషులకు మంచి చేయడానికి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారని, అందులో ఎటువంటి అనుమానం లేదని బీజేపీ నేత  కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మీకు సంబంధం లేదంటున్నారు గానీ.. మీకు సంబంధం లేకపోతే, మీకు చేతకాకపోతే  నువ్వు, మీ తండ్రి.. మంత్రి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండని సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లాలో నక్సలైట్ల కాల్పుల్లో మరణించిన  స్వర్గీయ గుండగోని మైసయ్య గౌడ్ 24వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి... ఆయన విగ్రహానికి పూల మాల వేసి, నివాళులు అర్పించారు. 

టీఎస్పీఎస్సీ పరీక్ష బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలదన్న కోమటిరెడ్డి... మాకు సంబంధం లేదని మీరు చేతులు దులుపుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది నిరుద్యోగులు భార్యాపిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి, అప్పులు చేసి, ఫీజులు కట్టి కష్టపడి చదివితే  మీ నిర్వాకం వల్ల ఎంతోమందికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ విషయంలో  తమకు సిట్ మీద నమ్మకం లేదని, సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ కవిత విషయం తాను గతంలోనే చెప్పానని కోమటిరెడ్డి అన్నారు. ఆమెకు ఎవరెవరితో పార్ట్ నర్ షిప్ లు ఉన్నాయిన్న విషయం కూడా చెప్పానన్నారు. వచ్చే బతుకమ్మ బిహార్ జైల్లోనే ఆడుతుందని మునుగోడు ఉప ఎన్నికల్లోనే చెప్పానంటూ కోమటిరెడ్డి గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో  కేంద్ర నిఘా సంస్థలు తప్పకుండా అవినీతిని బయటకు తీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అవే వాళ్లని జైళ్లో పెడతాయని, అందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పారు. ఎవరైతే తెలంగాణ దోచుకుంటున్నారో నిఘా సంస్థలు, బీజేపీ వాళ్ళని వదిలిపెట్టదని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించడానికి, భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాము రాత్రింబవళ్ళు కష్టపడి ఉద్యమం చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.