సూర్యాపేట, వెలుగు: సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నరని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలో ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, గడపగడపకు కాంగ్రెస్’ సూర్యాపేట నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో సూర్యాపేట సెగ్మెంట్ రాష్ట్రంలో నెంబర్ వన్ గా ఉందన్నారు.
తెలంగాణను ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే యువతకు రెండు లక్షల ఉద్యోగాలు, అమరవీరుల కుటుంబాలకు నెలకు రూ.25 వేలు , రూ.500కు గ్యాస్ సిలిండర్ , పేదలకు ఇందిరమ్మ ఇల్లు, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నదని, జెండాలు మోసే కార్యకర్తలను కూడా ఆయన గుర్తుపట్టే పరిస్థితిలో లేరని విమర్శించారు.