యాదాద్రి భువనగిరి జిల్లాలో..‘మహాలక్ష్మి’కే ప్రయారిటీ

  •     ఆ తర్వాతి స్థానంలో ‘గృహజ్యోతి’, ‘ఇందిరమ్మ ఇండ్లు’
  •     రైతులంతా ‘రైతు భరోసా’ కోసం అప్లికేషన్లు
  •     చేయూత పథకానికి వస్తున్న అప్లికేషన్లు చాలా తక్కువ

యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘ప్రజా పాలన’ కార్యక్రమం పండుగలా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన ఐదు గ్యారంటీల్లో మెజారిటీ ప్రజలు ‘మహాలక్ష్మి’ని ఎంపిక చేసుకుంటున్నారు. తర్వాత స్థానంలో ‘గృహజ్యోతి’, ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకాలకు టిక్​పెడుతున్నారు. ‘చేయూత’ పథకానికి డిమాండ్ తక్కువగా​ ఉంది. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన కౌంటర్లు మరో రెండు రోజులు కొనసాగనున్నాయి. తర్వాత ప్రభుత్వ ఆఫీసుల్లో అప్లికేషన్లు తీసుకుంటారు. ప్రభుత్వ హామీల ప్రకారం.. ఎంపికైన లబ్ధిదారులకు ‘మహాలక్ష్మి పథకం’ కింద నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్​సిలిండర్

‘రైతు భరోసా పథకం’ కింద రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు; ‘ఇందిరమ్మ ఇండ్లు పథకం’ కింద ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అమరవీరులు, ఉద్యమకారులకు 250 చ.గజాల ఇంటి స్థలం; ‘గృహజ్యోతి పథకం’ కింద కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్; ‘చేయూత పథకం’ కింద వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్​ అందుతుంది. 

లెక్కకు మించి అప్లికేషన్లు​

యాదాద్రి జిల్లాలో 2011 జనాభా  లెక్కల ప్రకారం 1.87 లక్షల ఇండ్లు ఉన్నాయి. ఆ సంఖ్య ఇప్పుడు 2.14 లక్షలకు చేరిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గ్యాస్, కరెంట్​కనెక్షన్ల సంఖ్య అంతకు మించి ఉంది. దీంతోనే అధికారుల అంచనాకు మించి ఐదు గ్యారెంటీల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి. ఎక్కువ మంది ‘మహాలక్ష్మి’ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వివిధ కేటగిరీల్లో పెన్షన్​పొందుతున్నవారు కూడా మహాలక్ష్మి పథకానికి టిక్​పెడుతున్నారు. ప్రతి కుటుంబం సబ్సిడీ గ్యాస్​కోసం దరఖాస్తు చేసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా జనరల్​ కనెక్షన్ తో పాటు దీపం, ఉజ్వల కలిపి 3లక్షల11వేల415 గ్యాస్​కనెక్షన్లు ఉన్నాయి. అన్ని రకాల కరెంట్​ కనెక్షన్లు కలిపి 4లక్షల31వేల244 ఉన్నాయి.

వీటిలో డొమెస్టిక్​కనెక్షన్లు 2లక్షల66వేల993 ఉన్నాయి. ఇంటి కనెక్షన్లు ఉన్న వారందరూ గృహజ్యోతి పథకానికి టిక్​పెడుతున్నారు. అలాగే జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. ఇందులో సాగుకు యోగ్యమైన భూమి 4.50 లక్షల ఎకరాలు ఉంటుందని అంచనా. ఇప్పటికే 2లక్ష71వేల590 మంది రైతు భరోసాకు అర్హులుగా ఉన్నారు. అయితే అభయహస్తం ఫామ్​లో రైతు భరోసాకు సంబంధించిన కాలమ్ ఉండడంతో రైతులుందరూ పట్టదారు పాసుబుక్స్​నెంబర్​రాసి, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో  పేర్కొంటున్నారు. 

ఇండ్లతో పాటు సబ్సిడీ కరెంట్ పొందాలని..

గత బీఆర్ఎస్​డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి, పదేండ్లలో అతి తక్కువ మందికి ఇచ్చింది. పూర్తయిన ఇండ్లను కూడా పంపిణీ చేయలేదు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ మంది అప్లయ్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లలో 60 శాతానికి పైగా ఇందిరమ్మ ఇండ్ల కోసం టిక్​పెట్టినట్లుగా తెలుస్తోంది. గత పదేండ్లలో పెండ్లిళ్లు అయిన జంటలు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లయ్ చేసుకుంటున్నారు. వారిలో కొందరు కరెంట్ సబ్సిడీ కోసం కూడా టిక్​చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు సబ్సిడీ కరెంట్ కోసం టిక్​చేస్తున్నాయి.

చేయూత గ్యారంటీకి పెద్దగా అప్లికేషన్లు రావట్లేదు. జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1.04 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. కొత్తగా 1.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిల్లో ఎక్కువగా మహిళలనే యాజమానికిగా పేర్కొంటున్నారు. చివరి రెండు రోజులు భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కుటుంబాల్లో మెంబర్లుగా ఉన్న వాళ్లు కొత్త కార్డులు కావాలని అప్లికేషన్లలో రాస్తున్నారు. పాత రేషన్​కార్డుల్లో పిల్లలను చేర్చాలని కోరుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2లక్షల16వేల855 రేషన్ కార్డులు ఉన్నాయి.