మున్సిపాలిటీలకు ‘ముంపు’ భయం

  • వరంగల్​, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, భద్రాచలం పట్టణాల్లో గతేడాది వరదలు
  • ఆయా చోట్ల నీటమునిగిన వందలాది కాలనీలు
  • హామీల మీద హామీలు ఇచ్చిన సీఎం, మంత్రులు
  • వందల కోట్లతో ప్రతిపాదనలు పంపిన ఆఫీసర్లు
  • ఫండ్స్​ లేక ముందట పడని పనులు
  • కాగితాలకే పరిమితమైన నాలాలు, కరకట్టలు

నెట్​వర్క్​, వెలుగు: వర్షాలు ఊపందుకోవడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని జనాల్లో ఆందోళన మొదలైంది. కొన్నేండ్లుగా వర్షాలు, వరదల వల్ల వరంగల్, కరీంనగర్​కార్పొరేషన్లతో పాటు నిర్మల్, సిరిసిల్ల తదితర పట్టణాలోని వందలాది కాలనీలు నీటమునుగుతున్నాయి. గతేడాది గోదావరికి వచ్చిన వరదలు మంచిర్యాల, భద్రాద్రి టెంపుల్ ​టౌన్​ను అతలాకుతలం చేశాయి. కాలనీలు మునిగిన ప్రతిసారీ ఆయా ఏరియాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..శాశ్వత వరద నివారణ చర్యలు చేపడ్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత మరిచిపోతున్నారు. నాలాల విస్తరణ, కరకట్టల నిర్మాణం, ఇతరత్రా పనుల కోసం వరంగల్​ కార్పొరేషన్​ సహా ఆయా మున్సిపాలిటీల నుంచి ఇప్పటికే పలుమార్లు ప్రపోజల్స్​ పంపినా సర్కారు నుంచి సరిపడా ఫండ్స్​ రాకపోవడంతో ఏ ఒక్క పనీ ముందట పడడం లేదు. దీంతో ఈసారి కూడా లోతట్టు ప్రాంతాల్లోని పబ్లిక్​కు వరద కష్టాలు తప్పేలా లేవు.  

భద్రాచలానికి వంద కోట్లు ప్రకటించినా.. 

గోదావరికి వరద వస్తే భద్రాచలం టౌన్ కు ముప్పు తప్పదు. 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా టౌన్​ ముంపునకు గురికాకుండా రూ.15 కోట్లతో 2003లో 7 కిలోమీటర్ల మేరకు 80 అడుగుల ఎత్తులో కరకట్టలు కట్టారు.  20 ఏండ్ల కింద నిర్మించిన స్లూయిజ్​ల నిర్వహణ అధ్వానంగా ఉండడం, రివిట్​మెంట్ అక్కడక్కడా దెబ్బతినడంతో వరద నీరు  టౌన్​లోకి  వస్తోంది. పోలవరం బ్యాక్ వాటర్, సీతమ్మసాగర్ కాపర్ డ్యాం వల్ల కూడా వరద ప్రమాదం పొంచి ఉంది. దీంతో భద్రాచలానికి శాశ్వతంగా వరద ముప్పును తప్పించడానికి ఇరిగేషన్​ ఆఫీసర్లు ఏడాది కింద రూ.15 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపారు. కరకట్ట ఎత్తు మరో15 అడుగులు పెంచడంతోపాటు స్లూయిజ్​లను పటిష్టపరచడం, నీటిని ఎత్తిపోసేందుకు భారీ మోటార్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 

కానీ, ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేయలేదు. గత ఏడాది  వరదలు వచ్చినప్పుడు భద్రాచలంలో పర్యటించిన సీఎం కేసీఆర్ గోదావరికి ఇరువైపులా కరకట్ట కట్టేందుకు  రూ.1000 కోట్లు ప్రకటించారు. గోదావరి జిల్లాలో ప్రవేశించే చోటినుంచి గోదావరి,-కిన్నెరసాని సంగమం వరకు కరకట్ట నిర్మాణానికి రూ. 950 కోట్లు ఖర్చవుతాయని ఇరిగేషన్​ అధికారులు అంచనా వేసి రిపోర్ట్​ పంపారు. దీనిపైనా ప్రభుత్వం స్పందించలేదు. గత ఏడాది 71.1 అడుగుల వరద రాగా జిల్లాలో 23వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. 10,831 ఎకరాల్లో పంట నీటమునిగింది. మళ్లీ వానాకాలం రావడంతో వరద వస్తే ఎలాగని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

సిరిసిల్లలో రూ.280 కోట్లతో ప్లాన్​..పైసా ఇయ్యలే..  

నాలుగేళ్లుగా సిరిసిల్లకు ఎగువన ఉన్న 20 చెరువులు మత్తడి దుంకుతుండడంతో పట్టణాన్ని వరద ముంచెత్తుతోంది. వరద ముప్పు నుంచి సిరిసిల్లను కాపాడేందుకు అధికారులు రూ. 280 కోట్లతో ప్లాన్ ​రెడీ చేశారు. సిరిసిల్లను ఆనుకుని ఉన్న చెరువు మత్తడి దుంకినప్పుడు ఈ నీటిని మిడ్​మానేరులోకి మళ్లించేందుకు రగుడు బైపాస్ నుంచి వరద కాలువ నిర్మించాలని ప్లాన్ చేశారు. మంత్రి  కేటీఆర్ ఆదేశాలతో ఈ ప్లాన్ తయారు చేసినా ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. కొత్త చెరువు మత్తడి నీళ్లను మళ్లించేందుకు శాంతినగర్ బైపాస్ రోడ్ నుంచి రూ.6 కోట్లతో వరద కాలువ నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా స్లోగా సాగుతున్నాయి. కొత్త చెరువు మత్తడి దుంకితే  శాంతినగర్ నీట మునుగుతోంది.   

మంచిర్యాలకు మళ్లీ ముంపు ముప్పు 

మంచిర్యాలలో వరదలను నివారించేందుకు రాళ్లవాగు పొడవునా కరకట్టలు కడుతామన్న ప్రజాప్రతినిధుల హామీ ఏడాదైనా నెరవేలేదు. మళ్లీ వర్షాకాలం రావడం, ఈసారి కూడా ముంపు ముప్పు పొంచి ఉండడంతో గతేడాది పరిస్థితిని తల్చుకుంటూ జనం ఆందోళన చెందుతున్నారు. నిరుడు జులైలో కురిసిన భారీ వర్షాలతో గోదావరితో పాటు రాళ్లవాగు, తోళ్లవాగులకు వరద పోటెత్తింది. మంచిర్యాలలోని దాదాపు సగం కాలనీలు నీటమునిగాయి. మూడు నాలుగు రోజుల పాటు జలదిగ్బంధంలోనే మగ్గిపోయాయి. ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే ఇలా జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిరుడు గోదావరికి పెద్ద ఎత్తున వరద రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లన్నీ ఒకేసారి ఓపెన్​ చేశారు. అప్పటికే దిగువనున్న సుందిళ్ల బ్యారేజీ నిండుకుండలా మారింది. దీంతో ఎల్లంపల్లి నుంచి వచ్చిన వరద మంచిర్యాలను ముంచెత్తింది. 

మరోవైపు రాళ్లవాగు, తోళ్లవాగుల్లోకి గోదావరి బ్యాక్​ వాటర్​ పోటెత్తింది. దీంతో మంచిర్యాల ఎన్టీఆర్​నగర్​, రాంనగర్​, పద్మశాలి కాలనీ, ఎల్​ఐసీ కాలనీ, ఆదిత్య ఎన్​క్లేవ్ , సంజీవయ్య కాలనీ, రెడ్డికాలనీలు నీటుమునిగాయి. తోళ్లవాగు ఉప్పొంగడం వల్ల నస్పూర్​ మున్సిపాలిటీలోని పలు కాలనీలను వరద చుట్టుముట్టింది. పాత మంచిర్యాల, వేంపల్లి, ముల్కల్ల ప్రాంతాలు సైతం మునిగిపోయాయి.  అధికారులు రాళ్లవాగుకు 5.7 కిలోమీటర్ల పొడవు, 148 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. భూసేకరణకు రూ.200 కోట్లు, కరకట్టల నిర్మాణానికి రూ.20 కోట్లు, ఇతర పనులకు మరో రూ.14 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసి గవర్నమెంట్​కు రిపోర్టు పంపారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.  

వరంగల్​లో నాలాల ఆక్రమణలతోనే ముప్పు 

2020 ఆగస్టులో కురిసిన భారీ వానలకు గ్రేటర్​ వరంగల్ నీట మునగగా 130 కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఆగస్టు 18న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్​లతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ముంపునకు కారణమైన  నాలాల ఆక్రమణలను కూల్చివేయాలని ఆదేశించారు. అధికారులు  కూల్చివేతలు ప్రాంభించినా కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆ  ప్రక్రియ నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా నగరంలో చాలాచోట్ల నాలాలు, డ్రైనేజీలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి రిపేర్లకు కేటీఆర్​ రూ.25 కోట్లు మంజూరు చేశారు. ఆ ఫండ్స్​తో నయీంనగర్ నాలా రిటైనింగ్​వాల్స్​ పనులు చేపట్టగా సకాలంలో ఫండ్స్​అందక పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నయీంనగర్​, బొందివాగు, భద్రకాళి నాలాల డెవలప్​మెంట్​కోసం రూ.250 కోట్లతో ప్రపోజల్స్​ పంపగా..ఇంతవరకు పైసా రిలీజ్​ కాలేదు. దీంతో ముంపునకు ప్రధాన కారణమైన బొందివాగు నాలా పనులు చేపట్టలేకపోయారు. నగరం చుట్టూరా కాకతీయులు నిర్మించిన చెరువుల గొలుసు కట్టు తెగిపోవడం, వరద నీటిని మళ్లించేందుకు సరైన డ్రైన్లు, కల్వర్టులు లేకపోవడం కూడా ముంపునకు కారణమవుతోంది.  పనులు పెండింగ్​లో ఉండడంతో కొద్దిపాటి వర్షం పడినా లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ప్రపోజల్స్​కాగితాలకే పరిమితం 

గట్టి వాన పడితే చాలు నిర్మల్ టౌన్ లోని చాలా కాలనీలు నీట మునుగుతున్నాయి. స్వర్ణ వాగు ఒడ్డునే ఉన్న జీఎన్ఆర్ కాలనీ స్వర్ణ ప్రాజెక్టు నుంచి  వాగులోకి నీటిని విడుదల చేసినప్పుడల్లా వరద ముప్పును ఎదుర్కొంటోంది. స్వర్ణ ప్రాజెక్టు నీటిని వాగులోకి వదలడంతో 2021లో కాలనీలోకి వరద పోటెత్తింది. పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి స్థానికులను రక్షించారు. నాటు పడవల్లో  బయటకు తీసుకొచ్చారు. శాశ్వతంగా వరద ముప్పును తప్పించేందుకు , కాలనీకి రక్షణ కల్పించేందుకు వాగు ఒడ్డున కరకట్ట నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతోపాటు సోన్ నుంచి ఖానాపూర్ వరకు గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మించాలని ప్లాన్​ చేశారు. రూ. 70 కోట్లతో ఎస్టిమేట్లు తయారు చేసి.. సర్కారుకు పంపారు. ప్రభుత్వం ఈ ప్లాన్​కు ఇంకా గ్రీన్​సిగ్నల్​ ఇవ్వలేదు.