Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ చరిత్రాత్మకం: పిప్రిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

  • పాదయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నా
  • మీ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎంను అయ్యాను
  • ఆదిలాబాద్ ను గుండెల్లో పెట్టి చూసుకుంటా
  • త్వరలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తం
  • ఆర్థిక ఇబ్బందులున్నా స్కీమ్స్ అమలు చేస్తున్నం
  • ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నం
  • హామీ ఇచ్చినట్టే ధరణి బంగాళాఖాతంలో వేశాం
  • నిరుద్యోగులకోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం
  • పిప్రిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఆదిలాబాద్: ఎన్నికలకు ముందు తాను ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చరిత్రాత్మకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ పిప్రిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే తాను 32 రోజుల పాటు పాదయాత్ర చేశానని, ప్రజల గుండె చప్పుడు విన్నానని అన్నారు. 

మీ ఆశీర్వాదంతోనే డిప్యూటీ సీఎంను అయ్యానని భట్టి చెప్పారు. పాదయాత్ర సందర్బంగా ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయని, వాటిని ఒక్కొక్కటిగా కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. అప్పుడు చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలో వేశామని తెలిపారు. ధరణిపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని, దానిని సమూలంగా ప్రక్షాళన చేస్తామని వివరించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాదని  అన్నారు. ఈ జిల్లాను తాను గుండెల్లో పెట్టి చూసుకుంటానని  చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామని, ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రుణమాపీని అమలు చేశామని అన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, 8 నెలల్లో 30 వేల కొలువులు భర్తీ చేశామని, అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేశామని వివరించారు. 

ఆడ బిడ్డలకిచ్చిన మాటకోసం మహిళా తల్లులకు మొదటి రోజునే ఫ్రీ బస్ స్కీం ను ప్రారంభించామని చెప్పారు.  త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని భట్టి చెప్పారు. ఇందు కోసం ఒక్కో ఇంటికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్టు ఆయన వివరించారు. తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు ను నిర్మించి తీరుతామని అన్నారు రూ. 45 కోట్లు వెచ్చించి పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ప్రారంభిస్తామని వివరించారు.