కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని తహసీల్దార్ ఆఫీసులు, మీ–సేవా కేంద్రాల్లో క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. గతవారం రోజులుగా సర్టిఫికెట్ల కోసం ఒక్కో తహసీల్దార్ ఆఫీసుకు రోజూ 300 నుంచి 400 అప్లికేషన్లు వస్తున్నాయి. టౌన్ ఏరియాల్లో వీటి సంఖ్య 700 కు పైనే ఉంది. వేల సంఖ్యల్లో దరఖాస్తులు వస్తుండడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2 రోజులుగా సర్వర్సతాయిస్తోంది. మీ సేవాలో సర్టిఫికెట్ల కోసం అప్లయ్ చేయడానికి ప్రాసెస్ షూరు చేయగానే సర్వర్ బీజీ అని వస్తోంది. గంటల తరబడి ఇదే పరిస్థితి. దీంతో ప్రజలు రాత్రివరకు మీ సేవా కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.
తంటాలు పడి అప్లయ్ చేసినా, తహసీల్ ఆఫీసుల్లో వాటిని డౌన్లోడ్ చేసి వెరిఫికేషన్ చేయడం, తిరిగి లోడ్ చేయడానికి కూడా సర్వర్ సతాయిస్తోంది. దీంతో సర్టిఫికెట్ల జారీ డిలే అవుతోంది. దరఖాస్తుదారులు ఆఫీసుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల మీ –సేవా కేంద్రాల్లో లైన్కోసం టోకెన్ఇస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, లింగంపేట, భిక్కనూరు, బిచ్కుంద తదతర చోట్ల ఆఫీసుల వద్ద వందలాది మంది కనిపిస్తున్నారు.
ఆర్థిక సాయం కోసం..
బీసీల్లోని 15 కులవృత్తుల వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు గవర్నమెంట్ ప్రకటించింది. ఈ నెల 20 వరకు ఆన్లైన్లో అప్లయ్చేసుకోవాలని సూచించారు. ఇందుకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ల జతచేయాల్సి ఉంది. ఈ సర్టిఫికేట్ల కోసమే సంబంధిత వర్గాల వారు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు అకడమిక్ ఇయర్ ప్రారంభమైన దృష్ట్యా ఆయా సంస్థల్లో చేరే వారికి కూడా సర్టిఫికేట్లు కావాలి. వీటి కోసం స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు వస్తున్నారు. ఇటు ఆర్థిక సాయం కోసం అప్లయ్ చేసుకున్నవారు, అటు స్టూడెంట్స్తో ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి.
కంప్యూటర్ఆపరేటర్ల దగ్గర తమ సర్టిఫికెట్ చూడాలంటే, తమది చూడాలంటూ పేపర్లు పట్టుకొని బతిమిలాడుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా సర్టిఫికెట్లు జారీకావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక సాయం అప్లయ్చేసుకునేందుకు మరో 5 రోజులే గడువు ఉండడంతో సర్టిఫికెట్లు జారీ కానీ వారు ఆందోళన చెందుతున్నారు. గడువు పొడిగిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
సర్వర్ బీజీగా ఉందంటున్రు
సర్టిఫికెట్ల కోసం అప్లయ్చేయడానికి మీ సేవా సెంటర్కి పోతే సర్వర్ బీజీ ఉందని చెబుతున్రు. 5 రోజులుగా తిరుగుతున్నా. అప్లయ్చేయడానికి ఈ నెల 20 తారీఖు వరకే ఛాన్స్ఉందంట. గడువు పెంచితే మంచిగుండె.
శంకర్, నిజామాబాద్
అప్లయ్ చేసినా.. ఇంకా రాలే
కుల వృత్తి చేసుకునేటోళ్లకు రూ.లక్ష ఇస్తామని, ఇందుకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావాలంటున్రు. వీటికోసం అర్జీ చేసి 4 రోజులయింది. రోజూ ఆఫీసుకు వస్తున్నా, ఇంకా పని కాలే. సర్వర్ బీజీ అని చెబుతున్రు. నేను ఒక్కొన్నే కాదు, నా లెక్క వందల మంది వస్తున్రు.
మైసయ్య, కామారెడ్డి