భారతదేశంలో కులం అనేది ఒక వాస్తవికత. అన్ని కులాల సమాహారమే మతాలు. హిందూ మతంలో గత మూడువేల సంవత్సరాల నుంచి కులవ్యవస్థ వేళ్ళూనుకొని ఉంది. ఎక్కడైతే కులం ఉందో అక్కడ వివక్ష, అసమానతలు ఉంటవి. అందుకే భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనేది ఒక ముఖ్యమైన మౌలిక సూత్రం. ఇది సుప్రీంకోర్టులో కేశవానంద భారతి కేసులో రుజువయ్యింది.
భారత రాజ్యాంగ పీఠికలో సామాజిక న్యాయ భావన ఆర్టికల్ 14, 15, 16, 17లలో కనిపిస్తుంది. ఆర్టికల్ 39ఏలో సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం కనిపిస్తుంది. గత 77 ఏండ్ల స్వాతంత్ర్యంలో బీసీలు అన్నిరంగాల్లో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. అన్నివిధాలుగా నష్టపోతున్నారు. సంప్రదాయ చేతివృత్తులు. కులవృత్తులు విధ్వంసం కావటం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన వారి జీవితాలు దుర్భరంగా మారాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ..ఓబీసీ జాతీయ సదస్సు, ధర్నా చేపట్టింది. ఢిల్లీలో నిన్న కానిస్టిట్యూషన్ క్లబ్లో దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించబోయే జనగణనలో సమగ్ర కులగణన తదితర అంశాలపై బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం జాతీయ ఓబీసీ రాజకీయ నాయకులు, బీసీ సంఘాలతో సదస్సు జరిగింది. ఈరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా (సత్యాగ్రహ దీక్ష) నిర్వహిస్తోంది.
Also Read : అవే అడుగుజాడలా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 1993 వరకు బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం, రాష్ట్ర విద్యా, ఉద్యోగాలలో 1973 వరకు రిజర్వేషన్లు లేకపోవడం, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో 2008 వరకు రిజర్వేషన్లు లేకపోవడం, చట్టసభలలో బీసీలకు అసలు రిజర్వేషన్లే లేకపోవడం, ఎస్సీ, ఎస్టీల వలె ఉద్యోగాల్లో బ్యాక్ లాగ్ భర్తీ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు లేకపోవడం, ఆర్థిక అభివృద్ధికి బడ్జెట్లో సరైన కేటాయింపులు, సబ్ ప్లాన్లు బీసీలకు లేకపోవటం గమనార్హం. బీసీల హక్కులు, అధికారాలు, అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడడానికి చట్టసభలలో సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం వలన బీసీలు అన్ని రంగాలలో వెనకబడడానికి కారణమైంది. ఇప్పటికైనా బీసీ సోదరులు వాస్తవాలు తెలుసుకుని ఏకమై పోరాడాలి.
జనగణనలో సమగ్ర కులగణన
బ్రిటిష్ వారు ఈ దేశంలో 1881 నుంచి 1931 వరకు అన్ని కులాల, మతాల లెక్కలు ప్రతి పదేండ్లకు ఒకసారి నిర్వహించే సెన్సెస్ (జనగణన)లో సేకరించేవారు. కానీ, స్వాతంత్య్ర భారత దేశంలో ఈ నల్ల దొరలు సమగ్ర కుల గణన చేపట్టకపోవడంతో ఓబీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వెనుకబాటుతనం తేటతెల్లం కాకపోవడంతో ఓబీసీల జీవన ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయి. వారిని ఏకతాటిపై నడపడానికి కులగణన చాలా అవసరం.
ఇది భారతీయ సమాజాన్ని ప్రతిబింబింపచేసే ఒక సమగ్ర దర్పణం. ఓబీసీలను అణగదొక్కుతున్న శక్తులను ఎదుర్కొని, ఏకం కావడానికి ఈ కులగణన చారిత్రక అవసరం. కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2011లో, అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై 2011 సెన్సెస్‌లో కుల గణన చేయాలని పార్లమెంట్ సాక్షిగా వాదించింది. అలాగే 2018 ఆగస్టు 31న ఆనాటి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లోక్‌సభలో 2021 సెన్సెస్‌లో కులగణన చేస్తామని ప్రకటించి, 2022లో సుప్రీంకోర్టులో కులగణన చేయబోమని ఆఫిడవిట్ వేశారు.
ఇప్పుడూ మేం కులగణనకు వ్యతిరేకమని చెబుతున్నారు. ఇది వారి ద్వంద్వ నీతికి నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం 2011లో సామాజిక, ఆర్థిక కులగణన చేసి ఆ రిపోర్టు ప్రకటించలేదు. ఇప్పుడు తమ ఐదు న్యాయాలలో కుల గణన, సామాజిక న్యాయం, రిజర్వేషన్ల పెంపుపై నిజం తెలుసుకొని మాట్లాడడం హర్షణీయం.
బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
దేశ జనాభాలో 52%, తెలంగాణ రాష్ట్ర జనాభాలో బీసీలు 61% ఉన్నారు. కానీ, వారికి విద్య, ఉద్యోగాలలో దేశంలో 27%, రిజర్వేషన్లు, రాష్ట్రంలో 29% (4% ముస్లిం బీసీలు) రిజర్వేషన్లు మాత్రమే అమలుచేస్తున్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నప్పుడు, తెలంగాణలో ఈబీసీలు 4% ఉండగా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు, బీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్లు కల్పించకూడదు? ఇది కేవలం బీసీలను అణచివేసే కుట్ర. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సుప్రీంకోర్టు తీర్పులు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ 1961, ఇంద్రసహాని 1993 కేసులను అధిగమించడానికి రాజ్యాంగ సవరణ చేసి బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీల వలె చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ మహిళలకు కూడా జనరల్ మహిళలాగ 1/3 రిజర్వేషన్లు కల్పించాలి.
ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి
ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంది. కేంద్ర సెక్రటేరియెట్లో 90 మంది ఐఏఎస్ స్థాయి కార్యదర్శులు ఉండగా కేవలం బీసీలు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇది తీవ్ర వివక్షకు నిదర్శనం. అందుకే ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల వలె ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, బ్యాక్ లాగ్ ఖాళీలు భర్తీ చేయాలి. ఈరోజు కేంద్రంలో 40 లక్షల ఉద్యోగాలలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.
కానీ, ఓబీసీల శాతం (2022లో కేంద్రమంత్రి లోక్ సభలో ప్రకటించిన ప్రకారం) 22% మాత్రమే. ఇంకా 27% రిజర్వేషన్ల శాతానికి కూడా బీసీలు చేరలేదు. అందులో 10 శాతం అయినా జనరల్ కోటాలో వచ్చినవారు ఉంటారు. కావున రిజర్వేషన్లు వాడుకున్నవారు కేవలం 12 శాతం మాత్రమే. ఇంకా 15% ఖాళీలు ఉన్నట్లుగానే భావించాలి. అంటే 30 లక్షలలో 15% అంటే సుమారు 4 లక్షల యాభైవేల ఉద్యోగాలు ఓబీసీలకు చెందాలి. తక్షణమే బ్యాక్లాగ్ ఖాళీల కోటాలో ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్
ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు 1993 ఇంద్రసహాని కేసులో తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కేంద్రం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేసి 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు అందించడం అంటే ఓబీసీలకు తీవ్ర అన్యాయం చేయటమే. జస్టిస్ ఆర్ఎఫ్. నారీమన్ 103వ రాజ్యాంగ సవరణపై సుప్రీంకోర్టు తీర్పును డిసెంబర్ 7, 2024 నాడు జరిగిన వి.ఆర్. కృష్ణయ్యర్ మెమోరియల్ ఉపన్యాసంలో తప్పుపట్టారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి.
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ
దేశంలో యాభై శాతానికిపైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. సామాజిక న్యాయ శాఖలోనే అంతర్భాగంగా ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీలకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి, స్కాలర్షిప్లు వంటివి రూపొందించి అమలుచేస్తున్నారు. బీసీలకు వివిధ పథకాలు అమలుపై ప్రత్యేక దృష్టి సారించడం లేదు. బీసీల సమగ్ర అభివృద్ధికి, సాధికారతకు పథకాలు అమలుచేయడం లేదు. అందువల్ల బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
ALSO READ : సైన్యాధ్యక్షుడు రాని యుద్ధం నెగ్గేదెలా? ఫామ్‌హౌస్‌కే కేసీఆర్.. కారణం ఇదే కావొచ్చు..!
ఆర్థిక అసమానతలు
1993 నుంచి కేంద్రం ప్రైవేటైజేషన్ ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. బీసీల బతుకులు అగమ్యగోచరంగా మారిపోయాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా అసమానతలు పెరిగిపోయాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగి ఒక్క శాతం అగ్రకులాల జనాభా వద్ద 42% సంపద కేంద్రీకృతమై ఉంది. భారత రాజ్యాంగం పీఠికలో ఉన్న సోషలిజం అనే పదానికి విలువ లేకుండా పోయింది. గత 75 ఏండ్లుగా రాజ్యాంగం అమలులో ఉన్నా బీసీలకు సామాజిక న్యాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో బీసీలు సామాజిక, రాజకీయ, ఆర్థిక హక్కుల కోసం పోరాడాలి. రాజకీయ శక్తిగా ఎదిగి రాజ్యాధికారం సాధించాలి. ఇదే బీసీల అంతిమ లక్ష్యం. బీసీలందరం ఏకమై పోరాడాలి. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప.
- టి చిరంజీవులు, (ఐఏఎస్ రిటైర్డ్) చైర్మన్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం-