- మంత్రి తుమ్మల హెచ్చరించినా డోంట్ కేర్
- జెండా పాట కంటే రూ.5వేల దాకా తగ్గింపు
- కొనుగోళ్లను అడ్డుకుని నిరసన తెలిపిన రైతులు
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పంటను అమ్ముకునేందుకు రైతులకు తిప్పలు తప్పడం లేదు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే హెచ్చరిస్తున్నా వ్యాపారులు ఖాతరు చేయడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు, వ్యాపారులు సహకరించాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. కమిషన్ దారులు, కొనుగోలుదారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారు. మంచి క్వాలిటీ మిర్చీకి జెండా పాటగా నిర్ణయించిన ధరను ఒకరిద్దరు రైతులకు మాత్రమే ఇచ్చి, మిగిలిన పంటను క్వింటాకు నాలుగైదు వేల దాకా తగ్గించి కొంటున్నారు. శుక్రవారం జెండాపాటను రూ.20,800 గా నిర్ణయించిన వ్యాపారులు, మిగిలిన మిర్చిని రూ.14 వేల నుంచి రూ.16 వేలలోపే పెట్టి కొన్నారు.
జెండా పాటకు కూడా ఇద్దరు కొనుగోలుదారులు మాత్రమే అటెండయ్యారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లను అడ్డుకొని, మార్కెట్ గేటు దగ్గర బైఠాయించారు. అధికారులు, వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో దాదాపు రెండు గంటల పాటు మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ సింగ్ మార్కెట్ కార్యాలయానికి చేరుకొని, రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. జెండా పాటతో పాటు, మిర్చి కొనుగోళ్ల సమయంలో ట్రేడర్లు ఎక్కువ మంది హాజరయ్యేలా చూస్తానని హామీనివ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
క్రమంగా తగ్గుతున్న రేట్లు..
జనవరి మొదటి వారం నుంచి ఖమ్మం మార్కెట్‌కు కొత్త మిర్చీ వస్తోంది. ఫిబ్రవరి మొదటివారంలో క్వింటాల్‌కు రూ.22500 వరకు పెట్టిన వ్యాపారులు క్రమంగా తగ్గిస్తున్నారు. ఖమ్మం మార్కెట్ నుంచి బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, థాయిలాండ్ తో పాటు15 దేశాలకు ఎగుమతి చేస్తారు. అక్కడి నుంచి ఎక్స్ పోర్ట్ ఆర్డర్లు ఎక్కువగా ఉన్నప్పుడు రేటు పెరుగుతుందని, ఆర్డర్లు లేనప్పుడు ధర తగ్గుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం వ్యాపారులు కావాలనే ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా క్వాలిటీ మిర్చిని అడ్డికి పావుశేరు లెక్కన కొని, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి రేట్లు పెరిగినప్పుడు అమ్ముకుంటున్నారని చెప్తున్నారు .
మరోవైపు ఖమ్మం మార్కెట్లో మిర్చి నాణ్యతను నిర్ధారించే యంత్రాలున్నా, వాటిని పక్కనపడేశారు. చేతుల్తో పట్టి చూసి క్వాలిటీ ఉన్న మిర్చిని కూడా బాగా లేదంటూ తక్కువ రేటు చెబుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోవడం, వైరస్ల కారణంగా ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోందని చెబుతున్నారు. క్వింటాకు రూ.20వేలకు పైగా అమ్ముకుంటే తప్ప తమకు గిట్టుబాటయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. క్వాలిటీ పేరుతో వ్యాపారులు కొర్రీలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెనక్కి తీసుకెళ్లేందుకు చిక్కులు..
ఖమ్మం మార్కెట్ కు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీ నుంచి శుక్రవారం 45 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. రూ.14వేల నుంచి రూ.16వేలే పెడ్తుండడంతో రేటు నచ్చని రైతులు, తమ పంటను మార్కెట్ నుంచి తిరిగి ఇంటికి తీసుకెళ్దామంటే చిక్కులు ఎదురయ్యాయి. యార్డుకు తెచ్చిన తన పంట ఉత్పత్తి బస్తాలను రైతు బయటకు తీసుకెళ్లాలంటే, కమిషన్ వ్యాపారి లెటర్ హెడ్ పై తన వద్దకు వచ్చిన రైతు బస్తాలను బయటకు తీసుకెళ్తున్నట్టు రాసి, మార్కెట్ సెక్రెటరీ కి వినతి పెట్టుకోవాలి.
అలా పెట్టిన వినతి మేరకు మార్కెట్ సిబ్బంది బస్తాలు లెక్కేసి అధికారికంగా ఓకే అంటేనే బస్తాలు బయటకు వెళ్తాయి. సమయానికి సెక్రటరీ అందుబాటులో ఉండకపోయినా, ఆయన అప్రూవల్ లేకపోయినా రైతులకు తిప్పలుపడ్తున్నారు. ట్రాన్స్పోర్ట్ భారం కూడా పడ్తుండడంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకే పంటను తెగనమ్ముకుంటున్నారు. వ్యాపారులు చెప్పిన రేటు నచ్చని రైతులు సెల్ఫ్ అప్రూవల్ పై తీసుకెళ్లేలా మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ధర్నా గురించి ఆరా తీసిన మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్: ఖమ్మం మిర్చి మార్కెట్ లో శుక్రవారం జరిగిన ధర్నాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మార్కెటింగ్ డైరెక్టర్ జి.లక్ష్మీ బాయిని ఆరా తీశారు. సచివాలయంలో ఆయన మార్కెటింగ్ డైరెక్టర్ తో సమీక్ష నిర్వహించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సుమారు 50 వేల బస్తాలు ఖమ్మం మార్కెట్ కు తెచ్చారని, అందులో 5 శాతం పంట తేమ, నాణ్యతా ప్రమాణాలు లేని మిర్చీకి తక్కువ ధర రావడంతో కొంతమంది రైతులు ధర్నా చేశారని మార్కెటింగ్ డైరెక్టర్ తెలిపారు.
మార్కెటింగ్ అధికారులు,జిల్లా అధికారులు,పోలీస్ సిబ్బంది.., రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రైతులకు మార్కెట్లలో అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.