పెప్సికో ఇండియా మధ్యప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఉజ్జయినిలో ఫ్లేవర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రూ.1,266 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్టు పెప్సికో ఇండియా మంగళవారం ప్రకటించింది. 22 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్లాంట్ భారతదేశంలో పెప్సికో పానీయాల ఉత్పత్తిని పెంచడంలో, ఉపాధిని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
2024లో ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కానుండగా.. 2026 ప్రారంభంలో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వ మద్దతుతో మా పరిధిని విస్తరించబోతున్నామని పెప్సికో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగ్రత్ కొటేచా అన్నారు. ఇది భారత్ లో కంపెనీకి రెండవ తయారీ కేంద్రం కానుంది.
ప్రస్తుతం కంపెనీకి పంజాబ్‌లోని చన్నోలో ఒక తయారీ కేంద్రం ఉంది. అమెరికన్ ఫుడ్ అండ్ బెవరేజీ కంపెనీ పెప్సికో వియత్నాంలో అదనంగా 400డాలర్ల మిలియన్ పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంది. సుంటోరీ పెప్సికో వియత్నాం బెవరేజెస్‌తో సహా 60 కంటే ఎక్కువ అమెరికా సంస్థల ప్రతినిధులు గత వారం వియత్నాం పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం వెల్లడైంది.