- గడువు దాటినా సాగుతున్న పనులు
- స్టూడెంట్స్కు తప్పని తిప్పలు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తరగతులు ప్రారంభమై రెండేళ్లు గడిచినా, మూడో ఏడాదిలో విద్యార్థుల ప్రవేశాలకు గడువు సమీపిస్తున్నా, మెయిన్ బిల్డింగ్ నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగుతలేవు. 2021 నవంబర్ లో పనులు ప్రారంభించగా, 2023 నవంబర్ నాటికి పనులు పూర్తి కావలసి ఉంది. కాంట్రాక్టర్కు సకాలంలో బిల్లులు రాకపోవడం, నిర్మాణ ప్రదేశంలో గుట్టలు, పెద్ద రాళ్లను చదును చేయడంలో ఆలస్యం కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది.
మొదటి దశలో రూ.47 కోట్లతో నర్సింగ్ కాలేజీ కోసం నిర్మించిన భవనంలోనే 2022 నవంబర్ లో ఫస్ట్ఇయర్150 మంది విద్యార్థులతో వైద్య విద్యను ప్రారంభించారు. ఆ భవనంలోనే రెండేళ్లుగా తరగతులు కొనసాగిస్తున్నారు. వసతి గృహాల సౌకర్యం లేక పట్టణంలోని ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకున్నారు. రోజూ బస్సుల్లో మెడికల్ విద్యార్థులు కాలేజీకి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఇయర్లో మెడిసిన్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు ప్రవేశాలు పొందితే సమస్య మరింతగా తీవ్రంకానుంది.
సాగుతున్న నిర్మాణ పనులు..
ప్రస్తుతం వైద్య విద్యాబోధన సాగిస్తున్న నర్సింగ్ కాలేజీ ఎదురుగానే మెడికల్ కాలేజీ బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.163 కోట్లతో చేపట్టనున్న మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు 2021లో నవంబర్ లో శంకుస్థాపన చేశారు. ఆరు బ్లాకుల్లో ఐదు అంతస్తుల్లో భవనాల పనులు ప్రారంభించారు. మూడు బ్లాకుల నిర్మాణాలు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. ఇందులో అంతర్గత పనులు, ఎలక్ట్రికల్ పనులు చేయాల్సి ఉంది.
వంటగది, డైనింగ్ హల్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కాలేజీ ప్రహరీ, ఆవరణలో ఫ్లోరింగ్ పనులు నిర్వహించాల్సి ఉంది. రూ.116 కోట్లతో చేపట్టిన భవన నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు సుమారు రూ.55 కోట్ల మేర పనులు చేపట్టారు. కాంట్రాక్టర్విజ్ఞప్తి మేరకు అధికారులు 2024 సెప్టెంబర్ వరకు మరోసారి గడువు పొడిగించారు. ఇప్పటి వరకు యాభై శాతం వరకు పనులు పూర్తి కాలేదు. గడువు మేరకు పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి మూడేళ్లు కావస్తున్నా బిల్డింగ్ పనులు పూర్తి కాకపోవడంతో మెడికల్ స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో బిల్లులు అందేలా చర్యలను చేపట్టి, పనులు వేగవంతం అయ్యేలా చూడాలి.
- శాంతన్ రామరాజు, బీసీ సంఘం జిల్లా నాయకుడు, మహబూబాబాద్