- దుర్గం చెరువు పరిసరవాసులతో సమావేశం
- ఎఫ్ టీఎల్, బఫర్‌జోన్‌పై వినతులు, అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదానికి నాలుగు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ రంగనాథ్ అన్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్‌సీ), సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థల ఇంజినీర్లను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు.
ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి గతంలో హెచ్ఎం డీఏ ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై పరిసర ప్రాంతాల నివాసితుల అభ్యంతరాలను హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం హైడ్రా కార్యాలయంలో రంగనాథ్ స్వీకరించారు. సమావేశంలో ఆరు కాలనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌కు సంబంధించి అభ్యంతరాలను వినిపించారు.
25 ఏండ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. వాస్తవానికి ఈ చెరువు ఎఫ్‌టీఎల్ 65.12 ఎకరాలు కాగా.. ఇప్పడు ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారించినప్పడు తమ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటామని.. శాస్త్రీయ పద్ధతులు పాటించి ఎఫ్‌టీఎల్ హద్దులు నిర్ధారిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చారు.