- 20 వేల సీట్లకు అనుమతి కోరిన యాజమాన్యాలు
- విజ్ఞప్తిని నిరాకరించిన సర్కారు
- ఎక్కువగా కంప్యూటర్ రిలేటెడ్ సీట్లు ఉండటమే కారణం!
- కన్వర్షన్ సీట్లపైనా నిర్ణయం పెండింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. బీటెక్ లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చిన 20వేల కొత్త సీట్లకు పర్మిషన్ ఇవ్వాలని రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాయి. కానీ, సర్కార్ మాత్రం 2,640 సీట్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ప్రైవేట్ యాజమాన్యాలు అడిగిన సీట్లన్నీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వే కావడంతో వాటికి అనుమతి నిరాకరించినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మరోపక్క కన్వర్షన్ సీట్లపైనా సర్కారు తన నిర్ణయం పెండింగ్ పెట్టింది.
కొత్త సీట్ల పెంపుతో బీటెక్‌లో మొత్తం సీట్ల సంఖ్య 1,01,661కి చేరింది. స్టేట్‌లో ఇంజినీరింగ్ (ఎప్ సెట్) అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 173 కాలేజీల్లో 98,296 సీట్లున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో కన్వీనర్ కోటా ద్వారా 70,307 సీట్లను భర్తీ చేస్తామని వెల్లడించింది. ఆ తర్వాత మరో 725 సీట్లతో రెండు కాలేజీలకు అనుమతిచ్చింది.
అయితే, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఏఐసీటీఈ అనుమతిచ్చిన 20,055 కొత్త సీట్లపై, 9వేల కన్వర్షన్ సీట్లపైనా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల15తో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగియగా, కొత్త సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని, దీంతో 17 వరకూ వెబ్ ఆప్షన్ల గడువు పెంచినట్టు విద్యాశాఖ ప్రకటించింది.
అనుమతి నిరాకరణకు రెండు కారణాలు!
ఏఐసీటీఈ అనుమతిచ్చిన 20వేల సీట్లలో కేవలం 2,640 సీట్లకు మాత్రమే మంగళవారం అనుమతి ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సీట్లన్నీ సీఎస్ఈ దాని అనుబంధ కోర్సులవే ఉండటం, కొత్త సీట్లతో సర్కారుపై ఆర్థిక భారం పడనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. 20కి పైగా కాలేజీల్లో 2,640 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కన్వర్షన్‌కు 9వేల సీట్లుకన్వర్షన్ సీట్లపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సుమారు 9వేల సీట్లను ప్రైవేటు కాలేజీలు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులకు కన్వర్షన్‌కు పెట్టుకున్నాయి. అయితే, వీటిలో సుమారు 1,800 సీట్లు కోర్ గ్రూపులకు సంబంధించినవి ఉండటంతో, వాటి కన్వర్షన్‌కు సర్కారు అనుమతించడం లేదని తెలుస్తున్నది. మిగిలిన 6,500 సీట్లకు అనుమతి వచ్చే అవకాశం ఉంది.