- కొండపైకి ఆటోలకు పర్మిషన్.. సీరియల్ ప్రకారం రోజుకు వంద చొప్పున
- పైనే భక్తుల వసతికి ఏర్పాట్లు.. సామగ్రి భద్రతకు క్లాక్‌రూమ్
- ఆఫీసర్ల రివ్యూలో నిర్ణయాలు.. ప్లాన్‌కు ఆమోదముద్ర పడ్తే తీరనున్న కష్టాలు
యాదాద్రి, వెలుగు: పునర్నిర్మాణం తర్వాత యాదగిరి గుట్ట నర్సింహస్వామి భక్తులు ఎదుర్కొంటున్న కష్టాలు తీరే టైం వచ్చింది. ప్రధానంగా గుట్టపై తాగునీరు, వసతి, టాయిలెట్స్ లాంటి కనీస వసతుల్లేక భక్తులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇంతకుముందు సర్కారు వీటిపై దృష్టి పెట్టకపోవడంతో పాటు గుట్టపైకి ఆటోలను కూడా అనుమతించలేదు. దీంతో గుట్టపైకి ఆటోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కొత్త సర్కారు ఆలోచిస్తోంది. ఈమేరకు ఇటీవల ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదవ్ టెంపుల్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి, ప్లాన్ రెడీ చేశారు. ఈ ప్రపోజల్స్‌కు సర్కారు ఆమోదముద్ర పడితే భక్తులకు ఇబ్బందులు తొలగే అవకాశముంది.
గుట్టపై నిలువ నీడ లేదు...
యాదగిరి నర్సన్న ఆలయ పునర్నిర్మాణంలో గత సర్కారు సరైనా ప్లానింగ్ లేకుండా వ్యవహరించింది. మార్పులు, చేర్పులు చేస్తూ రూ. 1200 కోట్లతో ఆరేండ్లపాటు నిర్మాణం కొనసాగించింది. టెంపుల్ పున: ప్రారంభమై రెండేండ్లు కావస్తున్నా ఇప్పటికీ కొండపై నిలువ నీడ లేకుండా లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎండాకాలమైతే కాళ్లు కాలుతున్నా దర్శనానికి గంటల పాటు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. వెంట తెచ్చుకున్న సామగ్రిని పెట్టుకోవడానికి ఏర్పాట్లే లేవు. కొండపై టాయిలెట్స్ లేక భక్తుల ఇబ్బందులు వర్ణాతీతం. సర్కారు గానీ, ఏండ్ల తరబడి ఆలయ ఈవోగా ఉన్న గీత గానీ..ఈ సమస్యలను కనీసం పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడడం, పైనుంచి వచ్చిన ఆదేశాలతో ఆమె రాజీనామా చేశారు. తర్వాత గుట్టపై వసతుల కల్పన, భక్తుల ఇబ్బందుల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గుట్టపై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇటీవల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణాన్ని స్పీడప్చేయాలని ఆదేశించారు. భక్తుల కష్టాలను తీర్చేందుకు ఏమేం చేయాలో చర్చించారు.
కొండపై 50కి పైగా టాయిలెట్స్
కూ లైన్లో తప్ప కొండపై ఎక్కడా టాయిలెట్స్ లేవు. లైన్లో ఎంటర్ కావడానికి ముందు.. దర్శనం తర్వాత భక్తులకు టాయిలెట్స్ ప్రధాన సమస్యగా మారింది. ఈ కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మొబైల్ టాయిలెట్స్ఉన్నా.. వచ్చే భక్తులకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ముందుగా టాయిలెట్స్సమస్య పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. కొండపై అత్యవసరంగా 50 వరకూ టాయిటెల్స్ నిర్మించాలని ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు.
వసతి, తాగునీటి సమస్య పరిష్కారానికి..
పునర్నిర్మాణంతో కొండపై భక్తులు సేదదీరడానికి, గుట్టపై నిద్రించడానికి అవకాశమే లేకుండా పోయింది. ఎంతో ఆశతో వచ్చిన భక్తులు గంటల వ్యవధిలోనే వెళ్లిపోవాల్సి వస్తున్నది. వీటిని దృష్టిలో పెట్టుకొని కనీసం 2 వేల మంది బస చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండపైకి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా.. సరిపోవడం లేదు. దీంతో కావల్సినంత నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు.
సామగ్రి కోసం క్లోక్‌రూం..
భక్తులు వెంట తెచ్చుకున్న వస్తువులను భద్రపరుచుకోవడానికి ఇప్పటి వరకూ కొండపై ఎక్కడా ప్లేస్ లేదు. తాము వచ్చిన వెహికిల్స్‌లోనే సామగ్రిని ఉంచుతున్నారు. వెహికిల్స్‌తో కొండపైకి వెళ్లాలంటే పార్కింగ్ ఫీజు రూ.500 కావడంతో ఎవరూ సామాన్లను పైకి తీసుకురావడం లేదు. కొండ కింద కారు పార్కింగ్ ఫీజు రూ.60 కావడం, సామగ్రిని పట్టుకొని పైకి ఎక్కే పరిస్థితి లేక కింద కారులోనే ఉంచుతున్నారు. దీంతో దేవుడి దర్శనానికి వచ్చినా వస్తువుల భద్రతపై ఆందోళన చెందాల్సి వస్తున్నది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరంగా క్లోక్‌రూం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో సీరియల్ ప్రకారం ఆటోలు..
కొండపైకి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించడంతో ఆటోలను నిషేధించారు. దీంతో కొండపైకి ఆటోలను నడపడం ద్వారా జీవనోపాధి పొందే దాదాపు 300 కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఏడాదికి పైగా ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సమయంలో తాజా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లకు కొండపైకి ఆటోలను అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల భువనగిరికి వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబు కూడా కొండపైకి ఆటోలు వెళ్లేట్టుగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. కొండపైకి వెళ్లే బస్సుల్లో కూడా భక్తులు కెపాసిటీకి మించి ప్రయాణిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొండపైకి ఆటోలను అనుమితించే అంశంపై రివ్యూ మీటింగ్‌లో చర్చించి ఫిబ్రవరి మొదటి వారంలోగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. 300 ఆటోలు ఉన్నందున రోజుకు వంద ఆటోలను కొండ మీదకు వెళ్లేలా రూల్స్పెట్టాలని, ప్రయాణికులు వద్ద నిర్ణయించిన ప్రకారం చార్జీ వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే కొండపైకి వచ్చిన ఆటోల పార్కింగ్ కోసం ముందుగా స్థలం చూడాల్సిన అవసరం ఉంది.
ప్రజల రుణం తీర్చుకుంట
నర్సన్న ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచా. భక్తుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తా. ఆటో డ్రైవర్ల ఆందోళనను అర్థం చేసుకున్నా. వారి ఆటోలను కొండపైకి అనుమతించేలా నిర్ణయం తీసుకుంటాం. గుట్టపై ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా చూస్తాం.
- బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
ఆటోలను తొందరగా అనుమతించాలి
2022 మార్చి 28 నుంచి కొండపైకి ఆటోలను నిషేధించడంతో ఉపాధి కోల్పోయాం. ఆలయ అభివృద్ధితో బతుకులు మంచిగైతయనుకుంటే ఆగమైనయ్. కొండపైకి ఆటోలను నిషేధిస్తున్నామని ముందే చెప్పుంటే ప్రత్యామ్నాయం చూసుకునేవాళ్లం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొండపైకి ఆటోలను అనుమతిస్తామని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య హామీ ఇవ్వడంతో..అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతిచ్చాం. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉంది. - కోల రాజు, ఆటో డ్రైవర్