ఏకగ్రీవం అయితేనే ఇసుక రీచ్‌‌‌‌లకు పర్మిషన్‌‌‌‌

వెంకటాపురం, వెలుగు : గ్రామసభల్లో ఏకగ్రీవంగా ఒప్పుకుంటేనే ఇసుక రీచ్‌‌‌‌లకు పర్మిషన్‌‌‌‌ ఇస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్‌‌‌‌జైన్‌‌‌‌ చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం, అంకన్నగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో ఇసుక క్వారీల కోసం నిర్వహించిన గ్రామసభలకు ములుగు ఎస్పీ గౌస్‌‌‌‌ ఆలంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతీక్‌‌‌‌జైన్‌‌‌‌ మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనులకు ఆర్థిక వనరులు కల్పించడం కోసం ప్రభుత్వం ఇసుక రీచ్‌‌‌‌లను ఏర్పాటు చేసిందన్నారు.

ఊరికి ఒకే సొసైటీ ఏర్పాటు చేసి ప్రతి కుటుంబంలో ఒకరికి మెంబర్‌‌‌‌ షిప్‌‌‌‌ ఉంటే డబ్బులు సమానంగా అందే అవకాశం ఉంటుందన్నారు. ఒకే గ్రామంలో రెండు, మూడు సొసైటీలు ఏర్పాటు చేయడం వల్ల గిరిజనుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఏకగ్రీవం కాని వీరభద్రవరం, అంకన్నగూడెం గ్రామాల సభలను వాయిదా వేశారు.

గ్రామస్తులు ఏకగ్రీవంగా ఒకే అంటేనే రీచ్‌‌‌‌కు పరిమిషన్‌‌‌‌ ఇస్తామని స్పష్టం చేశారు. ఏటూరునాగారం ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త, తహసీల్దార్‌‌‌‌ సరికొప్పుల సమ్మయ్య, ఎంపీడీవో బాబు, ఎస్సైలు అశోక్, వెంకటేశ్వర్లు, పెసా కోఆర్డినేటర్‌‌‌‌ కొమరం, ప్రభాకర్ పాల్గొన్నారు. 

చేయి ఎత్తితే రూ. 40 వేలు ?

వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో డబ్బుల అంశం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. గ్రామంలో మూడు గిరిజన సొసైటీలు ఉండగా ఇసుక రీచ్‌‌‌‌ కోసం రెండు సొసైటీలు మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. మొత్తం గిరిజన ఓటర్లు 230 మంది ఉండడంతో 120 ఓట్లు ఎవరికి వస్తే ఆ సొసైటీకే ఇసుక ర్యాంప్‌‌‌‌ నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు.

పోటీలో ఉన్న రెండు సొసైటీలకు అవసరమైన ఓట్లు లేకపోవడంతో కొనుగోళ్లు ప్రారంభించారు. తమ సొసైటీకి చెందిన సభ్యులకు రూ.20 వేలు, మరో సొసైటీలో ఉండి తమకు మద్దతు తెలిపితే రూ.40 వేలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.

ఇందుకోసం రాజమండ్రి, వరంగల్ ప్రాంతాలకు చెందిన రైజింగ్‌‌‌‌ కాంట్రాక్టర్లు సుమారు రూ.30 లక్షలు పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడం వల్లే గ్రామసభ వాయిదా వేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.