- వచ్చే నెల 2 నుంచి 15 వరకు అనుమతిస్తూ వరంగల్ సీపీ ఉత్తర్వులు
- రెచ్చగొట్టే స్పీచ్‌లు, పార్టీలు, వ్యక్తులపై కామెంట్లు
- చేయొద్దని ఆర్డర్స్ మా గొంతు నొక్కేందుకే కండీషన్లు: షర్మిల
హైదరాబాద్/వరంగల్/ నర్సంపేట, వెలుగు: వైఎస్‍ఆర్‍టీపీ చీఫ్ షర్మిల వరంగల్ జిల్లాలో తిరిగి పాదయాత్ర నిర్వహించేందుకు సీపీ రంగనాథ్ 15 కండిషన్స్ తో పర్మిషన్ ఇచ్చారు. గత ఏడాది నవంబర్ లో షర్మిల పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గానికి చేరుకోగా.. లోకల్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డిపై వ్యక్తిగత కామెంట్లు చేశారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెన్నారావుపేట మండలం శంకరమ్మతండా వద్దకు ఆమె కార్‌వ్యాన్, కన్వాయ్‌పై దాడిచేసి నిప్పుపెట్టారు. దీంతో లా అండ్ఆర్డర్ ఇష్యూ అంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్లోటస్పాండ్కు తరలించారు. కాగా, ఈ నెల 28 నుంచి తిరిగి యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ నాడెం శాంతికుమార్ సీపీకి అర్జీ పెట్టారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు కండీషన్లతో పర్మిషన్ ఇస్తూ సీపీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యాత్రకు అడుగడుగునా కండిషన్లు
షర్మిల పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా కండిషన్లు పెట్టారు. రెచ్చగొట్టే స్పీచ్ లు ఇవ్వొద్దని, వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, పార్టీలపై కామెంట్లు చెయొద్దని, పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారమే యాత్ర చేపట్టాలని, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. కాగా, వచ్చే నెల 2 నుంచి షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. యాత్ర ఆగిన శంకరమ్మ తండా నుంచే స్టార్ట్ చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8 నియోజకవర్గాల్లో షర్మిల యాత్ర కొనసాగనుంది. ముగింపు సభ పాలేరు నియోజక వర్గంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాకే ఇన్ని కండిషన్లా?
తన పాదయాత్రకు షరతులు పెట్టడంపై షర్మిల సీఎం కేసీఅర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పాదయాత్ర.. కేసీఅర్ పాలనకు అంతిమయాత్ర. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కేసీఆర్ కు భయం పట్టుకుంది. పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే కేసీఆర్ కు చెమటలు పడుతున్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు. అందుకే 15 కండీషన్లు పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే మా కర్తవ్యం’’ అని షర్మిల అన్నారు.