పట్టాలపైకి ఎలివేటెడ్ కారిడార్

  • రూ.3,812 కోట్లకు సర్కార్ గ్రీన్ ​సిగ్నల్​
  • ప్రాజెక్టు నిర్మాణానికి పాలన అనుమతులు మంజూరు
  •  500 పబ్లిక్, ప్రైవేటు స్థలాల గుర్తింపు  
  •  భూసేకరణకు ప్రభుత్వం కసరత్తు
  • నిర్వాసితులకు టీడీఆర్​ వెసులుబాటు

హైదరాబాద్, వెలుగు : హెచ్​ఎండీఏ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఎలివేటెడ్ కారిడార్ ​పనులు కొలిక్కి వచ్చాయి.  ప్రాజెక్టు నిధుల మంజూరుకు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్​ శాంక్షన్​ ఇచ్చేసింది. దీంతో 3,812 కోట్లతో రెండు కారిడార్ల నిర్మాణ పనులను ప్రారంభించడమే మిగిలింది. ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణపై ఇప్పటికే అధికారులు ఆయా ప్రాంతాలను గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. ప్రైవేట్​ ఆస్తుల సేకరణకు కూడా మార్కింగ్​ పనులు కంప్లీట్ చేశారు. త్వరలోనే సేకరణ నోటీసులు కూడా జారీ చేస్తారు.

ఇప్పటికే హెచ్​ఎండీఏ, కంటోన్మెంట్​, ఎయిర్​పోర్ట్​ అథారిటీ, డిఫెన్స్​ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీ కూడా పర్యటించి భూసేకరణపై ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే.. ప్రైవేటు భూములు కోల్పోయే బాధితులకు నష్టపరిహారం చెల్లింపుపైనా అధికారులు ట్రాన్స్​ అండ్​ డెవలప్​మెంట్ ​రైట్స్​(టీడీఆర్​) అమలు చేయాలని ఆలోచన చేశారు. మార్కెట్​ రేట్​ మేరకు డబ్బులు చెల్లించేందుకు కావలసిన నిధుల సేకరణపై కూడా హెచ్​ఎండీఏ కసరత్తు చేస్తోంది. నష్టపరిహారం కంటే టీడీఆర్ ఇచ్చేందుకే అధికారులు ఆలోచన చేశారు.

టీడీఆర్​ అంటే భూములు కోల్పోయే బాధితులు తమకు మిగిలిన స్థలంలో అదనపు అంతస్తులు( నాలుగు ఫ్లోర్లు) నిర్మించుకునే వెలుసు బాటు కల్పిస్తారు. ఇందుకు బల్దియా, హెచ్​ఎండీఏకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. తద్వారా హెచ్​ఎండీఏ పై కూడా నష్టపరిహారం భారం పడకుండా ఉంటుందని అధికారులు తెలిపారు. 

త్వరలోనే ఎల్​ఏఓ నియామకం

ప్రాజెక్ట్​కు భూ సేకరణాధికారి(ల్యాండ్ అక్విజిషన్​ ఆఫీసర్​) నియామకం త్వరలోనే చేస్తారని అధికారులు చెప్పారు.  ప్రాజెక్ట్ ను కంటోన్మెంట్​, మేడ్చల్ కలెక్టర్​, హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తాయి.  భూముల సేకరణ, నష్టపరిహారం చెల్లింపులు, ఇతరాలన్నీ కూడా భూసేకరణాధికారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అయితే ఎవరిని నియమిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కంటోన్మెంట్​ ఆఫీసర్​, మేడ్చల్​ కలెక్టర్​, హెచ్​ఎండీఏ ఎల్​ఏఓలో ఎవరినైనా నియమించే చాన్స్ ఉందని అధికారులు చెప్పారు. ఎల్​ఏఓను నియమించిన వెంటనే భూ సేకరణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.  

ప్రాజెక్టు స్వరూపం ఇలా.. 

ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్​ ప్యారడైజ్​ నుంచి బోయిన్​పల్లి డెయిరీ ఫామ్ రోడ్​ వరకు 5.32 కి.మీ డబుల్​ డెక్కర్​ ఎలివేటెడ్​ కారిడార్​ నిర్మిస్తారు. ఇందుకు రూ. 1580 కోట్ల నిధులు వెచ్చిస్తారు. ఇందుకు 74 ఎకరాలు  సేకరించాల్సి ఉండగా.. ఇందులో డిఫెన్స్​ ల్యాండ్​ 56 ఎకరాలు, ప్రైవేట్​ భూములు 9 ఎకరాలు ఉంటుంది. జేబీఎస్ నుంచి హకీంపేట మీదుగా శామీర్​పేట ఓఆర్​ఆర్​ను కలిపే ఎలివేటెడ్ ​కారిడార్​ను రూ. 2,232 కోట్లతో నిర్మిస్తారు. 11.12 కి.మీ. నిర్మించే ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించేందుకు అధికారులు అంచనా వేశారు.

ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్​కు చెందిన భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేట్ ​భూములను సేకరిస్తుండగా.. ఇప్పటి వరకు 300 ప్రైవేట్​ నిర్మాణాలను,  డబుల్ ​డెక్కర్​ కారిడార్​కు 200 పైగా నిర్మాణాలను గుర్తించారు. వీటికి మిలిటరీ ఎస్టేట్​ భూములు, ​కంటోన్మెంట్​బోర్డు భూములను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. దీంతో రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి రూట్ క్లీయర్ అయింది.