
- ప్రాజెక్టు పనుల్లో స్పీడందుకునేనా..?
- బడ్జెట్ కేటాయింపులు పెరిగేతేనే పనులు
- ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,955 కోట్లు
- ఇప్పటివరకు ఖర్చుచేసింది రూ.11,320 కోట్లు
- ఈసారి బడ్జెట్ లో రూ.750 కోట్లు కేటాయింపు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా భావించే సీతారామ ప్రాజెక్టు పర్మిషన్లు ఓకే అయ్యాయి. తాజాగా ఇంటిగ్రేటెడ్సీతారామ సాగర్, సీతమ్మ సాగర్‌ప్రాజెక్టు డీటెయిల్డ్ రిపోర్ట్(డీపీఆర్)కు సెంట్రల్ వాటర్‌కమిషన్(సీడబ్ల్యూసీ) గ్రీన్సిగ్నల్ఇచ్చింది. దీంతో పనులను వేగంగా చేపడతామని జిల్లా మంత్రులు పేర్కొంటున్నారు. ఇక రాష్ట్ర సర్కార్ కూడా ఫండ్స్ వెంటనే ఇస్తే పనుల్లో స్పీడ్ పెరగనుంది.
కేంద్రం వద్ద పెండింగ్ పడిన టెక్నికల్ పర్మిషన్లు కూడా వచ్చేశాయి. ఇటీవల రాష్ట్ర బడ్జెట్ పెంచిన కేటాయిం పులతో కలిపి సీతారామ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.19,955 కోట్లు. తాజా బడ్జెట్ లో రూ.750 కోట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం కేటాయింపుల్లో గత జనవరి వరకు రూ. 11,320 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు 57 శాతం పూర్తి అయ్యాయి. 2026లో రబీ సీజన్‌నాటికి కంప్లీట్ చేసేందుకు సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగిన విధంగా పనులు పూర్తి కావాలంటే నిధుల కేటాయింపు పెంచితేనే సాధ్యమనే అభిప్రాయాలు ఉమ్మడి జిల్లావాసుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా డీపీఆర్ అందించాలని..
సీతారామ ప్రాజెక్ట్‌కు 2016 ఫిబ్రవరి16న రోళ్లపాడు వద్ద అప్పటి సీఎం కేసీఆర్శంకుస్థాపన చేశారు.18 నెలల్లో పనులు కంప్లీట్ చేస్తామని చెప్పారు. అయితే.. భూ సేకరణ , టెక్నికల్ పర్మిషన్లు రాక, నిధుల కొరతతో లేట్ అయ్యాయి. ప్రాజెక్టును 67.05 టీఎంసీల నిల్వతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 11 అసెంబ్లీ సెగ్మెంట్లలోని 31 మండలాల్లో 4,15,620 ఎకరాల కొత్త ఆయకట్టు, 3,72,068 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు సాగులోకి రానుంది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద 36.5 టీఎంసీల నిల్వతో సీతమ్మసాగర్ఆనకట్ట నిర్మాణాన్ని గత సర్కార్ హయాంలోనే చేపట్టారు.
అయితే.. అప్పట్లో రెండింటికి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా డీపీఆర్ఇవ్వాలని సెంట్రల్ వాటర్‌కమిషన్(సీడబ్ల్యూసీ) సూచించింది. తాజాగా మూడురోజుల కింద జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) మీటింగ్ లో డీపీఆర్కే ఓకే చెప్పడంతో ప్రాజెక్టు నిర్మాణ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కాగా.. ఉమ్మడి ఏపీలో చేపట్టిన రాజీవ్, ఇందిరా సాగర్ఎత్తిపోతల స్కీమ్ లను స్వ రాష్ట్రం వచ్చాక రద్దు చేసి కొత్తగా వీటిని చేపట్టారు.
ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తయ్యేలా..
2018లో సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించగా.. 2022 చివరి నాటికి104.4 కి.మీ మెయిన్ కెనాల్ నిర్మాణం పూర్తయింది. మూడు పంప్ హౌస్‌లు పూర్తి చేయగా.. వీటిని గతేడాది ఆగస్టులో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సత్తుపల్లి ట్రంక్, పాలేరు ట్రంక్‌లో 60 కి.మీ పనులు పూర్తి కాగా.. మిగిలిన125 కి.మీ లింక్ కెనాల్స్ పనులు కొనసాగుతున్నాయి. 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలకు అన్నింటికీ టెండర్లు పూర్తవగా.. భూ సేకరణ సర్వే జరుగుతోంది. పాలేరు ట్రంక్ లో 8 కి.మీ టన్నెల్తవ్వాల్సి ఉండగా, ప్రస్తుతానికి 3.8 కి.మీ కంప్లీట్ అయింది.
సత్తుపల్లి ట్రంక్‌లో యాతాలకుంట వద్ద నిర్మిస్తున్న టన్నెల్ 1.78 కి.మీకు ప్రస్తుతానికి 1.14 కి.మీ పూర్తయింది. ఇక్కడ ఈ ఏడాది చివరి నాటికి పనులు ముగించే చాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ప్రభుత్వం వచ్చాక.. సీతారామ ప్రాజెక్టు కాల్వలకు అదనంగా రూ.100 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ ను చేపట్టింది. 9 కి.మీ నిర్మించి వైరా ప్రాజెక్టు కింద లక్షన్నర ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా చేపట్టారు. గతేడాది ఆగస్టు 15న దీన్ని ప్రారంభించగా, గత మార్చిలోఆయకట్టుకు వారం పది రోజుల పాటు నీటిని కూడా విడుదల చేశారు.
అయితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరం సమీపంలో పాసేజ్పిల్లర్కూలిపోవడంతో పాటు 20 మీటర్ల కాంక్రీట్ లైనింగ్ దెబ్బతింది. కురిసిన వర్షాలకు ప్రధాన కాల్వ రెండు చోట్ల గండ్లు పడి పంట పొలాలు నీట మునిగాయి. ప్రాజెక్టు పూర్తికాక ముందే లోపాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వీటిని అధిగమిస్తూ ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేసేందుకు నిధుల కేటాయింపుతో పాటు రిలీజ్లోనూ ప్రభుత్వం స్పీడ్పెంచాల్సి ఉంటుంది. ఇదే సమయంలో డీపీఆర్కు సీడబ్ల్యూసీ ఆమోదం తెలపగా కేంద్రం నుంచి కూడా ప్రాజెక్టుకు ఫండ్స్ తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
లక్షలాది ఎకరాల బీడు భూములు సాగులోకి..
సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్బ్యారేజీ పూర్తయితే లక్షలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయి. డీపీఆర్కు టెక్నికల్‌అడ్వైజరీ కమిటీ ఓకే చెప్పడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. అందుకు ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తా. త్వరలోనే ప్రజల తాగు, సాగు నీరు సమస్యలు తీరుస్తా.
తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి