మాజీ మంత్రి పేర్ని నానికి మరో షాక్ తగిలింది... రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానిని ఏ 6 గా చేరుస్తూ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో నాని భార్య జయసుధ ఏ1 గా ఉండగా ఆమె బెయిల్ పై ఉన్నారు. ఈ క్రమంలో పేర్ని నానికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచాలని ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ పేర్ని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంతలోనే.. పేర్ని ని ఏ 6 గా చేరుస్తూ కేసు నమోదవ్వటం హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉండగా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని. ముందస్తు బెయిల్ కోరుతూ ఇవాళ ( డిసెంబర్ 31, 2024 ) హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు పేర్ని నాని. పేర్ని నాని భార్య జయసుధ గోడౌన్ లో సుమారు 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైన నేపథ్యంలో జయసుధపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే... ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం కృష్ణా జిల్లా కోర్టును ఆమె ఆశ్రయించగా... కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ | ఏపీ CM చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ కృతజ్ఞతలు
అయితే.. ఈ కేసులో పేర్ని నానిని నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదవ్వడం ఊహించని ట్విస్ట్ అని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటిదాకా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇక పేర్ని నానిని నిందితుడిగా చేర్చుతూ కేసు నమోదవ్వటంతో ఊహించని మలుపు తిరిగిన ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి చూడాలి.