మరణంలోనూ వారి అనుబంధం వీడలేదు. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక ఆ అన్న గుండె కూడా ఆగిపోయింది. తమ్ముడు మృతదేహాన్ని చూసి అక్కడే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి లో జరిగింది.
భీంపల్లి గ్రామానికి చెందిన బచ్చల సదయ్య(41) ఈ నెల 12న (గురువారం) ఇంట్లో కాలుజారి పడి మృతి చెందాడు. గోదావరిఖనిలో ఉంటున్న అతని అన్నబచ్చల రాజు(50) తమ్ముడు మరణవార్త తెలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు. తమ్ముడు మృతదేహాన్ని చూసి రాజు అక్కడికక్కడే గుండెపోటుతో కూలిపోయాడు. అక్కడున్న బంధువులు కంగారుపడి రాజు ని పరీక్షించగా.. అతను చనిపోయినట్టు గుర్తించారు. సదయ్యకు వివాహం కాలేదు. రాజుకు భార్య కొడుకు కూతురు ఉన్నారు. నిరుపేదలైన అన్నదమ్ముల మృతి చెందడంతో వారి కుటుంబాలు మగదిక్కును కోల్పోయాయి. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.