
గండిపేట, వెలుగు: అర్ధరాత్రి తాగొచ్చి ఓ మహిళ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఎదురుతిరిగి కర్రతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై మౌనిక తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(50) గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
అతడి ఇంటికి సమీపంలో ఓ మహిళ భర్తతో కలిసి రెంట్‌కు ఉంటోంది. గురువారం రాత్రి ఉక్కపోతగా ఉండటంతో ఆమె ఇంటి తలుపులు తెరిచి నిద్రపోయింది. అర్ధరాత్రి 1.40 గంటలకు తాగిన మత్తులో శ్రీనివాస్ మహిళ ఇంట్లోకి వచ్చాడు. చప్పుడు కావడంతో ఆమె నిద్రలేచింది. ఈలోగా శ్రీనివాస్ అసభ్యంగా ప్రవరిస్తూ ఆమె మీదకు రాబోయాడు. దీంతో ఆమె శ్రీనివాస్‌ను బయటకు ఈడ్చుకొచ్చింది. కర్రతో అతడిని కొట్టింది. గాయపడ్డ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని ఉస్మానియాకు తరలించారు. మహిళను పీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు.