నిజామాబాద్, వెలుగు: టీఆర్ఎస్ జడ్పీటీసీ టార్చర్ భరించలేక ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వృద్ధురాలైన తన తల్లిపై, ఆపై తానూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా అక్కడే ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన సోమవారం నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్‍పల్లి మండలం యానంపల్లికి చెందిన గంగాకిషన్కు 6 ఎకరాల భూమి ఉండగా.. అందులో మూడున్నర ఎకరాలకు మాత్రమే పట్టా ఉంది. మిగతా రెండున్నర ఎకరాల భూమి విషయంలో డిచ్‍పల్లిలోని మండల స్థాయి ప్రజాప్రతినిధికి కిషన్‍కు మధ్య తగాదా నడుస్తోంది. రెండ్రోజుల కిందట తన అనుచరులతో ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రజాప్రతినిధి ప్రయత్నించగా తాను అడ్డుకుంటే.. దాడి చేసి కొట్టారని కిషన్ ఆరోపించారు. తనను చంపుతానని బెదిరించడంతో గోడు వెల్లబోసుకుందామని కలెక్టరేట్ కు వచ్చానని, తనను కలెక్టర్ ను కలవనీయకుండా అడ్డుకోవడంతో ఆత్మహత్యకు యత్నించానని చెప్పాడు. ఈ విషయం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి దృష్టికి వెల్లడంతో.. అధికారులకు చెప్పి భూ కబ్జా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని బాధితుడికి ఆయన భరోసా ఇచ్చారు. కిషన్ సూసైడ్ చేసుకునేందుకు యత్నింస్తుండగా అడ్డుకున్న ఓ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్ట్ గోపిని అక్కడున్నవారు మెచ్చుకున్నారు.
For More News..