టెక్నాలజీని సరైన క్రమంలో ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అవసరానికి మించి వాడితే అంతే అనర్థాలు జరుగుతాయి. వ్యక్తిగత సమాచారం అంతా ఇప్పుడు మొబైల్ లలోనే ఉండటంతో ప్రైవసీ దెబ్బతింటోంది. ఈ కారణంగా ఇప్పటి వరకు ఎన్నో అక్రమాలు, నేరాలు, లైంగిక వేధింపులు, బెదిరింపులు.. ఇలా చాలా చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ లో జరిగింది.
ముషీరాబాద్‌కు చెందిన సాయితేజ అలియాస్ సన్నీ అనే యువకుడు… బీఫార్మసీ చదువుతున్న తన సిస్టర్ ఫ్రెండైన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ అమ్మాయితో తనకున్న పరిచయంతో ఆమెకు తెలియకుండానే ఆమె ఫోన్లో ఓ యాప్ ను ఇన్‌స్టాల్ చేశాడు. దాని ద్వారా ఆమె ఫోన్లోని సమాచారం తన ఫోన్ నెంబరుకు వచ్చేలా ఆప్షన్ పెట్టుకున్నాడు. ఆ యాప్ కారణంగా.. ఆ యువతి ఫోన్ కెమెరాకు ఎదురుగా ఉన్న ప్రతీ దృశ్యం రికార్డ్ అయి, అతని ఫోన్ లోకి వెళ్లాయి.
అలా ఆమె ఫోన్ నుంచి కొన్ని వ్యక్తిగతమైన ఫోటోలు కూడా అతని మొబైల్ లోకి చేరడంతో ఆ ఫోటోలన్నింటిని సేవ్ చేసుకుని వాటిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ తరువాత వాటిని ఆ యువతికి చూపించి, తన కోరిక తీర్చాలని.. లేదంటే ఆ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. తన పర్సనల్ ఫొటోలు అతని చేతిలో ఉండటంతో ఏం చేయాలో పాలుపోక అతని మాటలకు లొంగి పోయింది బాధితురాలు.
ఫలితంగా మూడు సార్లు గర్భం కూడా దాల్చడంతో అబార్షన్ చేయించాడు. రాను రాను వాడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత యువతి భరించలేక రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడి నుంచి నిజాలు రాబట్టారు. ఓ యాప్ ద్వారా ఆ యువతిని మోసం చేసినట్లు అంగీకరించాడు. పూర్తి ఆధారాలు దొరకడంతో నిందితుడు సాయితేజ అలియాస్ సన్నీని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్ ను సీజ్ చేసి.. డేటా డిలీట్ చేశారు.