భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన పెసా చట్టం సక్రమంగా అమలు కావడం లేదు. కాంట్రాక్టర్లు ఇసుక రీచ్‌లలో అక్రమాలకు పాల్పడుతూ.. ఈ గిరిజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. దీంతో ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. పక్క జిల్లాల్లో పెసా గ్రామసభలు నిర్వహించి, ఇసుక రీచ్‌ల నిర్వహణపై ఆదివాసీలకు స్వయం అధికారం కల్పిస్తున్నారు. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో రీచ్‌ల నిర్వహణ కోసం గ్రామసభలు నిర్వహించడం లేదు. చర్ల మండలంలోని ఆర్‌కొత్తగూడెం, కత్తిగూడెం, మొగళ్లపల్లి, వీరాపురం రీచ్‌లు ఇలాగే కొనసాగుతున్నాయి. ఒక్కదానికీ గ్రామసభ ఆమోదం లేదు.
ఏమిటీ ఈ పెసా చట్టం..
ఆదివాసీల స్వయంపాలనకు పెసాను 1996లో పార్లమెంట్ఆమోదించింది. 1998 నుంచి ఈ చట్టం అమలవుతోంది. తెలంగాణలో 2006 లో జీవో నెం.66 ద్వారా చట్టం అమల్లోకి వచ్చింది. చిన్న తరహా ఖనిజాలపై ఆదివాసీలకు హక్కు కల్పించడం ఈ చట్టం ఉద్ధేశం. ఖనిజాలు ఉన్న గ్రామాల్లో ఆదివాసీలు సొసైటీలుగా ఏర్పడితే, వారికే క్వారీలను అప్పగించాలి. గ్రావెల్, మట్టి, ఇసుక, మెటల్ ఇలా చిన్న తరహా ఖనిజాల ద్వారా ఆదివాసీ గ్రామాలకు ఆదాయం చేకూరుతుంది. రెవెన్యూ, గ్రౌండ్‌వాటర్, మైనింగ్, ఇరిగేషన్ శాఖలు జాయింట్సర్వే నిర్వహిస్తాయి. సంబంధిత శాఖ చట్టపరమైన అనుమతులు తీసుకున్నాక మైనింగ్‌శాఖ గ్రామసభలు నిర్వహించాలి. గ్రామంలో ఏర్పడిన సొసైటీ ఎంత ఇసుక తీయాలి? ఏ టైం లోపు తీయాలి? ఇలా అన్నీ ఈ సభలోనే నిర్ణయిస్తారు. కానీ కాంట్రాక్టర్లు గ్రామసభ పెట్టకుండానే మైనింగ్ శాఖ సహకారంతో రాత్రికి రాత్రే రీచ్‌ల నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు.
భారీ యంత్రాలతో తవ్వకాలు..
ఇసుక రీచ్ లలో నిబంధనలకు వ్యతిరేకంగా భారీ యంత్రాలతో ఇసుక తోడుతున్నారు. చర్ల మండలం వీరాపురం వద్ద గోదావరిలో 99 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తోడేందుకు భూమిపుత్ర సొసైటీకి టీఎస్ఎండీసీ అనుమతులు ఇచ్చింది. సొసైటీ తరఫున రేజింగ్కాంట్రాక్టర్ఒకరు ఇసుక తోడుతున్నారు. వాస్తవానికి సొసైటీ సభ్యులే ఇసుకను మ్యాన్యువల్‌గా ట్రాక్టర్లలోకి లోడ్ చేసి ఒడ్డున డంపింగ్చేయాలి. తద్వారా కూలీలకు ఉపాధి లభిస్తుంది. కానీ కాంట్రాక్టర్నేరుగా జేసీబీలను గోదావరిలోకి దింపి.. పెద్దపెద్ద లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. పర్యావరణ నిబంధనలకు ఇది విరుద్ధం. వాల్టా చట్టం ప్రకారం ఎక్కువ లోతు తవ్వితే గిరిజన ఆవాసాల్లో భూగర్భజలాలు పడిపోతాయి. వీటిని పర్యవేక్షించాల్సిన టీఎస్ఎండీసీ ఆఫీసర్లు కనీసం ర్యాంప్వైపు కన్నెత్తి చూడటం లేదు. వీరాపురం ర్యాంప్‌లో యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘన జరుగుతోందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విచారణ చేస్తాం..
వీరాపురంలో యంత్రాలతో ఇసుక తవ్వకాల విషయం మా దృష్టికి వచ్చింది. విచారణ చేస్తాం. తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే. ప్రభుత్వం సూచించినట్లు తవ్వకాలు జరపాలి.
- ఎల్లయ్య, పీవో, టీఎస్ఎండీసీ
అక్రమాలు ఆపండి
వీరాపురం ఇసుక ర్యాంప్‌లో అక్రమాలను ఆపండి. గిరిజనుల కడుపు కొడుతున్నారు. ఈ ర్యాంప్ ద్వారా స్థానికులు పని దొరుకుతుందని ఆశపడ్డాం. ట్రాక్టర్లలో లోడ్ చేసి డంపింగ్ చేస్తే మాలాంటోళ్లకు నాలుగు పైసలు వస్తయి. ఆఫీసర్లు దయ చూపాలి.
- ఇర్పా వెంకటి, జీపీ పల్లి