భద్రాచలంలో వేధిస్తున్న తెగుళ్లు .. ధర లేక దిగులు

భద్రాచలంలో వేధిస్తున్న తెగుళ్లు .. ధర లేక దిగులు
  • మన్యం మిర్చి రైతుల వ్యథ
  • మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని వేడుకోలు

భద్రాచలం, వెలుగు: ఎన్నో ఆశలతో అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు మిర్చి పంటను సాగు చేసిన రైతులను తెగుళ్లు వేధిస్తున్నాయి. మరో వైపు గిట్టుబాటు ధరలేక దిగులు చెందుతున్నారు. మూడేళ్లుగా రేటు లేక అప్పులపాలైన రైతులు ఈసారైనా ఆ గండం నుంచి బయటపడదామనుకుంటే మళ్లీ నిరాశే మిగిలింది. అమ్మబోతే అడవి,  కొనబోతే కొరివి అన్నట్లుగా మార్కెట్లో మిర్చి రేట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులతో పాటు రైతు సంఘాల లీడర్లు సైతం క్వింటాల్​కు రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని, తెలంగాణలోనూ మిర్చిబోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. 

ఆది నుంచే నష్టం..

విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలవుతున్నాయి. క్వింటాల్​కు రూ.35 వేల నుంచి రూ.50 వేలు ఉండే మిర్చి విత్తనాలను బ్లాక్​లో రూ.1.20 లక్షల వరకు డీలర్లు విక్రయిస్తున్నారు. 100 గ్రాముల విత్తనాలు కొనుగోలు చేస్తే కేవలం 70 గ్రాములే వస్తున్నాయి. అక్కడి నుంచి రైతుకు నష్టం ప్రారంభమవుతోంది. కూలీలు, కౌలు, పురుగుమందులు, సాగునీరు ఇలా ఎకరానికి పెట్టుబడి రూ.3 లక్షల వరకు అవుతుంది. గతంలో ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది.

 కానీ, మూడేళ్లుగా ఎకరానికి 20 క్వింటాళ్లకు మించి రావట్లేదు. నల్లి తెగులు, వివిధ రకాల వైరస్​లు సోకి, పంట నిలువెల్లా మాడిపోతోంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్​కు రూ.14 వేలకు మించి ఇవ్వడం లేదు. ఈ ధర కూడా స్థిరంగా ఉండటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి పరివాహకంలోని నల్లరేగడి నేలల్లో పండే మిర్చికి డిమాండ్ ఉంది. కానీ, వ్యాపారులు సిండికేట్​గా మారి, రైతుల శ్రమను దోచేస్తున్నారు. 

ఆంధ్రాలో మిర్చి బోర్డు ఏర్పాటు.. 

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి సాగు ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రాలో మిర్చి రైతుల ఆందోళనలతో ఇటీవల మిర్చి బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో తమకూ మిర్చిబోర్డు కావాలనే డిమాండ్ ఇక్కడి​ రైతులు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నుంచి వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మిర్చి సాగు ఎక్కువగా ఉంటోంది. ఖమ్మం జిల్లాలో 59,262, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 10,420, మహబూబాబాద్​జిల్లాలో 48,234, నల్గొండ జిల్లాలో 7006, సూర్యాపేటలో 14,919 ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. 

ఈ ఐదు జిల్లాల నుంచే 3,00,240 మెట్రిక్ టన్నుల మిర్చి దిగుబడి వస్తుందని అంచనా. ఈ రైతులందరికీ ఖమ్మంలోని మార్కెట్ యార్డే దిక్కు. ఏటా రూ.2 వేల కోట్ల మేర కొనుగోళ్లు జరుగుతుంటాయి. పత్తికి సీసీఐ, పొగాకు టొబాకో, పసుపునకు టర్మరిక్​, ఆయిల్​ఫాంకు ఆయిల్​ఫెడ్​ తరహాలో మిర్చి కూడా మిర్చి బోర్డు కావాలని రైతులు కోరుతున్నారు. కనీసం క్వింటాల్​కు రూ.25 వేల గిట్టుబాటు ధరతోనైనా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదే..

మిర్చి రైతులు కష్టాల్లో ఉన్నారు. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాలదే. తక్షణమే మిర్చి బోర్డును ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధరను కల్పించాలి.  నాలుగేళ్లుగా వరుస నష్టాలతో అప్పుల సుడిగుండంలో అన్నదాత చిక్కుకున్నాడు. పెరిగిన పెట్టుబడులు వల్ల సాగు భారంగా మారింది. 

యలమంచి వంశీ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు