
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో గన్ కామన్ అయిపోయింది. ఈ గన్ కల్చర్ భూతానికి వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్క యాజమానిని గన్తో కాల్చింది. తృటిలో తప్పించుకున్న యాజమాని స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కుక్క గన్ కాల్చడం ఏంటి..? అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టేనస్సీలోని మెంఫిస్‌కు చెందిన ఓ దంపతులు ఓరియో అనే ఏడాది వయసున్న పిట్ బుల్ కుక్కను పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆ దంపతులు నిద్రిస్తుండగా బెడ్ పక్కనే తుపాకీ ట్రిగ్గర్లో కుక్క కాలు ఇరుక్కుపోయింది. గాఢ నిద్రలో ఉన్న దంపతులు ఇది గమనించలేదు. దీంతో ఓరియో తన కాలు బయటకు తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తూ గన్ మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ నేరుగా వెళ్లి నిద్రిస్తోన్న యాజమానికి తగిలింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
ALSO READ | హౌతీలపై అమెరికా భీకర దాడి
బుల్లెట్ తొడకు తగలడంతో ప్రాణపాయం తప్పింది. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. ప్రమాదశాత్తూ జరిగిన ఇన్సిండెట్గా పేర్కొన్నారు. ఈ ఘటనపై కుక్క యాజమాని ఫ్యామిలీ స్పందిస్తూ.. ‘‘ఓరియో చాలా సరదాగా ఉండే కుక్క. దానికి ఎగరడం, దూకడం అంటే ఇష్టం. కానీ ఈ ఘటన అనుకోకుండా జరిగిపోయింది’’ అని అన్నారు. ఈ ఘటన నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ట్రిగ్గర్ లాక్ చేసి పెట్టాలంటూ కొందరు.. పెంపుడు జంతువులకు తుపాకులు దూరంగా పెట్టాలంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే.. ఈ తరహా ఘటనలు జరగడం అమెరికాలో ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు సంవత్సరాల క్రితం, కాన్సాస్‌లో ఒక జర్మన్ షెపర్డ్ కుక్క వేట తుపాకీపై కాలు పెట్టడంతో అది ఫైర్ అయ్యి ఓ వ్యక్తి మృతి చెందాడు. 2018లో, ఐయోవాకు చెందిన 51 ఏళ్ల వ్యక్తి తన పిట్ బుల్-లాబ్రడార్ మిక్స్ ద్వారా కాలికి బుల్లెట్ తగిలింది.