యాదగిరిగుట్ట, వెలుగు: పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, ఉపాధ్యక్షురాలు తిరుమల కవిత వెంకటేశ్ గౌడ్ కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, జీపీ భవన నిర్మాణాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.
స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) ఫండ్స్ రెండేళ్లుగా రావడం లేదని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. జీపీ బోర్ల బిల్లులను రద్దు చేసి వ్యవసాయానికి ఇస్తున్నట్టు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని విన్నవించారు. కరోనా కారణంగా రెండేళ్ల కాలం వృథా అయ్యిందని, తమ పదవి కాలన్నీ మరో ఏడాది పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మేడబోయిన గణేశ్, దామోదర్ గౌడ్, రమాదేవి రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొండల్ తదితరులు ఉన్నారు.