- ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డూపై కామెంట్లుచేశారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు గాయపడేలా పవన్ నిరాధార ఆరోపణలు చేశారని అడ్వొకేట్ ఇమ్మనేని రామారావు ఈ కేసు వేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా ఇంటర్ నెట్‌లో సర్క్యులేట్ అవుతున్నాయని, ఆ వీడియోలను తొలగించాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్‌చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఎనిమిది యూట్యూబ్ లింక్స్ ను కోర్టుకు అందించారు.
లడ్డూ విషయంలో ల్యాబ్ రిపోర్టురాకముందే అందులో ఏవేవో కలిశాయని పవన్బహిరంగంగా వ్యాఖ్యానించారని, బాధ్యతగల పదవిలో ఉండి శాస్త్రీయతమైన ఆధారాలు లేకుండా ఆయన కామెంట్లుచేశారని రామారావు తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఐటీ యాక్ట్ 69 ప్రకారం ఇంటర్ నెట్ లో ఉన్న ఆ వీడియోలు తొలగించేలా బాధ్యులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తిరుపతి ప్రసాదంపై పవన్ కల్యాణ్ మరోసారి ఇలాంటి వాఖ్యలు చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది.