
- మామిడాల యశస్విని ఓటు తీసెయ్యాలె
- పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, వెలుగు : పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని ఓటును తొలగించాలని కోరుతూ దిండికి చెందిన కంపల్లి దేవ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్ కుమార్ల డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. యశస్విని ప్రవాస భారతీయురాలు అని, ఆమెకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదంటూ పిటిషనర్ తరఫు సీనియర్ లాయర్ రవిచందర్ వాదించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ నెల 15లోగా వివరాలు అందజేయాలని ప్రధాన ఎన్నికల అధికారి, నాగర్ కర్నూల్ కలెక్టర్, అచ్చంపేట ఆర్డీవోకు నోటీసులు జారీ చేసింది.
తుది ఓటర్ల జాబితా సమర్పించాలని పిటిషనర్‌ను కూడా ఆదేశించింది. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా నుంచి యశస్విని ఓటును తొలగించాలని పిటిషనర్ కోరారు. గత ఐదేండ్లలో 5.5 నెలలు మినహా మిగిలిన కాలమంతా ఆమె విదేశాల్లోనే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నారు. తదుపరి విచారణను ఈ నెల15కు వాయిదా వేసింది