
- ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్లో చేపట్టిన నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్దాఖలైంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ శశాంక్ శేఖర్ ఝా ఈ పిటిషన్దాఖలు చేశారు. అలాగే, దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, మరోసారి ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గత వారం ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, మాల్డా, హుగ్లీతో సహా మరికొన్ని జిల్లాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసన కారులు రైల్వే పట్టాలను దిగ్బంధించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు.
ముస్లింలు ఎక్కువగా నివసించే ముర్షిదాబాద్‌లో పోలీసుల వెహికల్స్‌కు నిప్పంటించారు. ఈ ఘటనల్లో సంసేర్‌గంజ్ ప్రాంతంలోని జాఫ్రాబాద్‌లో ముగ్గురు మరణించారు. అందులో ఇద్దరు తండ్రీ, కొడుకులు ఉన్నారు. అయితే, వారి డెడ్‌బాడీలపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి బుల్లెట్గాయంతో చనిపోయాడు. ఈ ఘటనల అనంతరం పోలీసులు దాదాపు 200 మందిని అరెస్టు చేశారు. ఈ అంశంపై ఇటీవల కలకత్తా హైకోర్టు కూడా స్పందించింది. తాము మౌన ప్రేక్షకుడిగా ఉండలేమని, హింసను నియంత్రించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.
కాగా, బెంగాల్లో మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున ఈ హింస రాజకీయ వివాదానికి కూడా దారితీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కునాల్ ఘోష్ మాట్లాడుతూ..ఈ హింసకు సరిహద్దు భద్రతా దళం, రెండు-మూడు రాజకీయ పార్టీల కుట్రే కారణమని ఆరోపించారు. ఈ ఆరోపణలను బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర ఖండించారు. "తృణమూల్ కాంగ్రెస్ ప్రమాదకరమైన, దేశ వ్యతిరేక, జిహాదీ నియంత్రణలో ఉన్న పార్టీ. ముర్షిదాబాద్ అల్లర్లపై మేము ఎన్ఐఏ దర్యాప్తును కోరుకుంటున్నాము" అని అన్నారు.