మానేరులో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పర్యావరణ అనుమతులు లేకుండా, నిబంధనలు అతిక్రమించి మానేరు నది నుంచి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారని నేషనల్‌‌‌‌ గ్రీన్ ట్రిబ్యునల్‌‌‌‌(ఎన్జీటీ) పిటిషన్‌‌‌‌ దాఖలు అయింది. గొట్టెముక్కుల సురేశ్‌‌‌‌ రెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌‌‌పై ఎన్‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌ విచారించింది. పిటిషనర్‌‌‌‌ తరపున అడ్వొకేట్‌‌‌‌ లక్ష్మణరావు వాదనలు వినిపించారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు నది నుంచి అక్రమంగా పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. జిల్లాలో ఇసుక తవ్వకాలకు టీఎస్‌‌‌‌ఎండీసీ ఈ ఏడాది మార్చిలో టెండర్లు పిలిచిందని, ఇది దక్కించుకున్న ఎస్‌‌‌‌కేఆర్‌‌‌‌ కన్‌‌‌‌స్ట్రక్షన్స్‌‌‌‌ నిబంధనలు అతిక్రమించి భారీగా ఇసుక తవ్వకాలు చేస్తూ వందల ట్రక్కుల్లో తరలిస్తున్నారని వివరించారు.

చెక్‌‌‌‌ డ్యాంలు, రిజర్వాయర్లు, బ్యారేజీలు, కాల్వల్లో ఇసుక పేరుకుపోకుండా వాటిని పరిరక్షిస్తూ ఇసుక వెలికి తీసేందుకు మాత్రమే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులిచ్చిందని తెలిపారు. రోజుకు 300 ట్రక్కులకు తక్కువ కాకుండా ఇసుక తరలించాలని అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నారని, కానీ, అంతకంటే ఎక్కువ ట్రక్కుల్లో ఇసుకను తరలిస్తున్నారన్నారు. పిటిషనర్‌‌‌‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ నెల 5లోగా అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీటీ గతంలో ఆదేశించగా, టెక్నికల్​ కారణాలతో దాఖలు చేయలేకపోయామని ప్రభుత్వం తరఫు అడ్వొకేట్‌‌‌‌ సంజీవ్‌‌‌‌ కుమార్‌‌‌‌ తెలిపారు. ఈ నెల 13లోగా అఫిడవిట్‌‌‌‌ దాఖలు చేయాలని ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌‌‌ ఆదేశించింది.