డంపింగ్​కు జాగా కరువు .. మడికొండ డంపింగ్ యార్డు నిండిపోవడంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు

డంపింగ్​కు జాగా కరువు .. మడికొండ డంపింగ్ యార్డు నిండిపోవడంతో ఎక్కడికక్కడ చెత్తకుప్పలు
  • చెరువులు, ఓపెన్ ప్లేసుల్లోనే అన్ లోడ్ చేస్తున్న కొందరు సిబ్బంది
  • తరచూ చెత్తను తగులబెడుతుండటంతో పొగ, ఘాటు వాసనలతో సమస్యలు
  • కరీంనగర్, ఖమ్మం రూట్ లో కొత్త యార్డుల ఏర్పాటుకు ప్రపోజల్స్​
  • అనుకూలంగా భూమి దొరక్క ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: గ్రేటర్​వరంగల్ సిటీకి డంప్​యార్డు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే మడికొండ డంప్​యార్డు నిండిపోవడం, అందులో చేపట్టిన బయోమైనింగ్​నత్తనడకన సాగుతుండటంతో డైలీ పోగవుతున్న చెత్తకు జాగా లేకుండా పోతోంది. సమస్యను పరిష్కరించేందుకు నగరానికి దూరంగా కొత్తగా మరో రెండు డంప్​యార్డుల ఏర్పాటుకు గ్రేటర్​ఆఫీసర్లు కసరత్తు చేశారు. అనుకూలమైన ల్యాండ్​దొరక్కపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మడికొండ డంపింగ్​యార్డులో చెత్త గుట్టలుగా పేరుకుపోవడంతో కొందరు మున్సిపల్ సిబ్బంది రోజువారీగా డంప్​ యార్డుకు తరలించాల్సిన చెత్తను చెరువులు, ఓపెన్​ప్లేసుల్లో డంప్​చేస్తున్నారు. రాత్రికి రాత్రి అదే చెత్తకు తగులబెడుతున్నారు. దీంతో జనాలు  ఇబ్బందులు పడాల్సివస్తోంది.

కొత్త యార్డులకు ల్యాండ్​కష్టాలు..

మడికొండ డంప్​యార్డులో ఇప్పటికే 5 లక్షల మెట్రిక్​టన్నులకుపైగా వ్యర్థాలు పోగయ్యాయి. స్మార్ట్​సిటీ కింద రూ.37 కోట్లతో బయో మైనింగ్ చేపట్టి, మూడు లక్షల టన్నుల వ్యర్థాలు శుద్ధి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆ ప్రక్రియ మూడేండ్లుగా కొనసాగుతూనే ఉంది. ఓవైపు డంప్​యార్డు నిండిపోగా, కొత్తగా జమవుతున్న చెత్తను వేసేందుకు జాగా సరిపోవడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పలుమార్లు నిర్వహించిన రివ్యూల్లో డంప్​యార్డు సమస్యను ప్రస్తావించి, ప్రత్యామ్నాయంగా మరో రెండు చోట్ల డంపింగ్​యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు.

 ఈ మేరకు వరంగల్-కరీంనగర్ రూట్ లో ఒకటి, వరంగల్​-ఖమ్మం రూట్ లో మరో డంప్​ యార్డు ఏర్పాటుకు కసరత్తు చేశారు. ఖమ్మం రూట్​లో మామునూరు ఎయిర్​ పోర్టు పునరుద్ధరణకు అడుగులు పడుతుండటం, దాంతోపాటు అక్కడి భూముల రేట్లు కూడా రూ.కోట్లలో ఉండటంతో డంప్​యార్డుకు అనుకూలమైన స్థలం దొరకడం లేదు. కరీంనగర్ రూట్ లో ఎన్​హెచ్​-563 ఫోర్​ లైన్ డెవలప్ అవుతుండటం, ఔటర్​రింగ్​రోడ్డు కూడా రానుండడంతో కొత్త డంపింగ్​యార్డుకు సమస్యగా మారింది. 

చెరువులు, టూరిస్ట్​ప్లేసుల్లో చెత్త డంపింగ్..​

వరంగల్ నగరంలో ప్రతిరోజు 450 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడి చెత్త ఉత్పత్తవుతోంది. మడికొండ డంప్​యార్డు నిండిపోయి కొత్త చెత్తకు జాగా లేని పరిస్థితి నెలకొంది. ఇంటింటా చెత్తను సేకరిస్తున్న కొందరు మున్సిపల్ సిబ్బంది ఆ వ్యర్థాలను ఓపెన్ ప్లేసుల్లో డంప్​చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్​హెచ్​-163 సమీపంలో దేవన్నపేట-కోమటిపల్లి మధ్యలో ఉన్న గవ్వం చెరువును పూర్తిగా చెత్తతో నింపేస్తున్నారు. నగరం మధ్యలో ఉన్న మిగతా చెరువులతోపాటు ఎస్సార్​ఎస్పీ కెనాల్​గట్లు, వరంగల్ కోటలోని ఓపెన్​ప్లేసులను కూడా డంప్​యార్డులుగానే మారుస్తున్నారు. 

అటువైపుగా వెళ్లిన వాళ్లంతా ఇబ్బందులు పడుతుండగా, చెరువులు మురికి కూపాలుగా మారుతున్నాయి. మరోవైపు చెరువులు, ఓపెన్​ప్లేసులు చెత్తతో నిండిపోతుండగా, సాయంత్రమైందంటే చాలు ఆ చెత్తకు నిప్పు పెడుతున్నారు. దీంతో ఘాటు వాసనలతో జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా మడికొండ డంప్​యార్డు, గవ్వం చెరువు నుంచి వచ్చే పొగతో రింగ్​రోడ్డుపై నిత్యం ఘాటు వాసనలతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రేటర్​అధికారులు, ప్రజాప్రతినిధులు డంప్​యార్డు సమస్య, బయోమైనింగ్​పై దృష్టిసారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.  

ALSO READ : కొత్తగూడెం రింగ్​ రోడ్డు స్పీడప్ .. తాజాగా టెండర్లను పిలిచిన ఎన్​హెచ్​

చెరువులను చెత్తతో నింపుతున్నరు..

రింగ్ రోడ్డు సమీపంలోని గవ్వం చెరువును పూర్తిగా చెత్తతో నింపేస్తున్నారు. ఇక్కడే నరసింహస్వామి ఆలయం ఉన్నా, గుడి ముందే చెత్తను డంప్​ చేస్తున్నారు. చెరువులో చెత్త వేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తే సైలెంట్​గా వెళ్లిపోయారు. ఇకనైనా చెత్తను చెరువుల్లో నింపకుండా తగిన చర్యలు చేపట్టాలి.- పి.బాలరాజు, సోషల్​యాక్టివిస్ట్, హనుమకొండ