- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- విచారణ 3 వారాలకు వాయిదా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీసు కంప్లయింట్ అథారిటీ, జిల్లా పోలీసు కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయకుండా కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలంటూ ప్రధాన కార్యదర్శి , హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్ర, జిల్లా పోలీసు కంప్లయింట్స్ అథారిటీని కార్యాలయాలు, సిబ్బందితో సహా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చినా అమలు చేయకపోవడంపై న్యాయవాది మామిడి వేణుమాధవ్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ.. పోలీసు కంప్లయింట్స్ అథారిటీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని కోర్టుకు తెలిపారు. 4 వారాల్లో సిబ్బందితో సహా కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పినా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదన్నారు. కనీసం కార్యాలయం, సిబ్బంది కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఇవి కాగితాలకే పరిమితం అయ్యాయని, విధులు నిర్వహించడంలేదన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.