విడుదలకు ముందు తెలంగాణలో పుష్ప-2కు ఊహించని కష్టం

విడుదలకు ముందు తెలంగాణలో పుష్ప-2కు ఊహించని కష్టం

హైదరాబాద్: రిలీజ్కు మూడు రోజుల ముందు పుష్ప-2 టికెట్ల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై రేపు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ.800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. టికెట్ల ధర కొన్నిచోట్ల రూ.3 వేలకు అమ్ముతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బుక్ మై షో, పేటీఎం, డిస్ట్రిక్ట్ యాప్స్లో కూడా 9.30 ప్రీమియర్ షో టికెట్లు అందుబాటులో ఉంచకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ 5న పుష్ప-2 సినిమా విడుదల కానుంది. అయితే.. తెలంగాణలో పుష్ప-2 సినిమాకు డిసెంబర్ 4న రాత్రి 9.30కే ప్రీమియర్స్ షోస్ ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోకు వెళ్లాలంటే.. సింగిల్ స్క్రీన్ అయినా, మల్టీప్లెక్స్ అయినా టికెట్ ధర 800 రూపాయలు.

Also Read : చీఫ్ గెస్ట్ లేకుండానే పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబర్ 5న అర్ధరాత్రి 1 గంటకు, 4 గంటలకు అదనపు షోస్ ప్రదర్శించడానికి కూడా పుష్ప-2 సినిమా టీంకు అనుమతి లభించింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ సింగిల్ స్క్రీన్ టికెట్ ధరపై 150 రూపాయలు, డిసెంబర్ 9 నుంచి 16 వరకూ 105 రూపాయలు, డిసెంబర్ 17 నుంచి 23 వరకూ 20 రూపాయలు ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇక.. మల్టీప్లెక్స్ ధరల విషయానికొస్తే.. డిసెంబర్ 5 నుంచి 8 వరకూ మల్టీప్లెక్స్, ఐమాక్స్ షోస్కు టికెట్పై 200 రూపాయలు, డిసెంబర్ 9 నుంచి 16 వరకూ 150 రూపాయలు, డిసెంబర్ 17 నుంచి 23 వరకూ 50 రూపాయలు టికెట్ ధరపై పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.