గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు

గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు

హైదరాబాద్: గ్రూప్‌ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్‌ జరిపించాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. రీవాల్యుయేషన్‌ జరిపించాలని గ్రూప్‌ 1 అభ్యర్థులు కొందరు పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు ఆరోపించారు.18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారనేది పిటిషనర్ల వాదన. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒకే మీడియంలో ప్రావీణ్యం ఉన్న నిపుణులతో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దించారని పిటిషన్లో వివరించారు. 

ALSO READ | టెన్త్ పేపర్ లీక్ కేసులో 11 మంది అరెస్ట్..నిందితులు వీళ్లే..

ఒకే నిపుణుడితో రెండు భాషల పేపర్లు దిద్దించడంతో నాణ్యత కొరవడిందని, తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల వాదనల తర్వాత టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ వేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌పై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ అభ్యర్థుల లాగిన్లో పేపర్ల వారీగా మార్కులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 వరకు.. అంటే నేటి వరకూ రీకౌంటింగ్కు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది.

రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీకి 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్1 మెయిన్​ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 31,403 మందిని ఎంపిక చేస్తే.. 21,093 మంది అటెండ్​ అయ్యారు. ఇంగ్లీష్తో పాటు మరో ఆరు సబ్జెక్టులకు సంబంధించి పరీక్షలు జరిగాయి. ఒక్కో పేపర్ 150 మార్కులుంటాయి. అయితే, దీనిలో ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై టెస్టు. దీంట్లో క్వాలిఫై అయితే.. మిగిలిన ఆరు పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కిస్తారు. 

ఇంగ్లీష్లో జనరల్ కేటగిరీల అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీలకు 30% మార్కులు వస్తేనే క్వాలిఫై అవుతారు. దీంట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకే మిగిలిన ఆరు సబ్జెక్టులకు సంబంధించి 900 మార్కులకు గానూ.. వచ్చే మార్కులను బట్టి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను టీజీపీఎస్సీ వెల్లడిస్తుంది.