
ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని వినతి
హైదరాబాద్, వెలుగు: ఎన్‌జీటీ తీర్పును అతిక్రమించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం పనులు చేస్తోందంటూ నారాయణపేట జిల్లా బాపన్‌పల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్.. గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రావణ్‌కుమార్.. ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో పిటిషన్ ఫైల్ చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖ కార్యదర్శులు, తెలంగాణ, ఏపీ చీఫ్ సెక్రటరీలు, కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 29న ఎన్‌జీటీ ఇచ్చిన తుది తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పనులు చేస్తున్న ఫొటో ఆధారాలను జత చేశారు. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంకు ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్ తప్పనిసరి అని ఎన్‌జీటీ తీర్పులో పేర్కొన్నారని గుర్తుచేశారు.
పనులు చేయొద్దని ఆదేశాలున్నయి..
అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించిందని పిటిషనర్ తెలిపారు. ఈనెల 12న రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు రాసిన లెటర్లోనూ ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు టెక్నికల్ అప్రైజల్ కోసం డీపీఆర్‌ను కేఆర్‌ఎంబీకి సమర్పించాలని ఆదేశించారని తెలిపారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్–2014 ప్రకారం పర్మిషన్లు తీసుకునే దాకా పనులు చేయొద్దని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి పలు సందర్భాల్లో లెటర్లు రాసిందన్నారు. ఎన్‌జీటీ తీర్పును అతిక్రమించి ఏపీ ప్రభుత్వం కర్నూల్ జిల్లా సంగమేశ్వరం వద్ద భారీ యంత్రాలు, వందలాది టిప్పర్‌లతో పనులు చేస్తోందన్నారు. నదిలో మట్టిపోసి చదును చేసి పంపుహౌస్ నిర్మాణానికి పూనుకుందన్నారు. ఏపీ అధికారుల పర్యవేక్షణలోనే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారని తెలిపారు.
For More News..