ఏడాది నుంచి బిల్లులిస్తలేరు.. గిరిజన ఆశ్రమ హాస్టళ్లు నడపలేం

ఏడాది నుంచి బిల్లులిస్తలేరు.. గిరిజన ఆశ్రమ హాస్టళ్లు నడపలేం

ఆసిఫాబాద్, వెలుగు: ఏడాదిగా పెండింగ్​లో ఉన్న డైట్ చార్జీలను రిలీజ్ చేయకపోవడంతో ఇక హాస్టళ్ల నిర్వాహణ తమవల్ల కాదంటూ కుమ్రం భీమ్​ఆసిఫాబాద్ జిల్లాలోని 46 గిరిజన ఆశ్రమ హాస్టళ్ల హెచ్ఎంలు, వార్డెన్లు బుధవారం కలెక్టర్ బోర్కాడే హేమంత్ సహదేవ్ రావుకు వినతి పత్రం అందజేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఇబ్బందులపై చర్చించారు. తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కనీసం టెండర్లు ఖరారు చేయకపోవడంతో సరుకులు సప్లై కావడం లేదన్నారు. 

అప్పులు చేసి హాస్టళ్లు నడిపిస్తున్నామని, స్టూడెంట్లకు భోజనాలు పెట్టడం సాధ్యం కాదన్నారు. గతేడాదికి సంబంధించిన 10 నెలల డైట్ బిల్లులు చెల్లించాలని, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన సరుకులు సప్లై చేయాలని, లేకపోతే గురువారం నుంచి హాస్టళ్లను బంద్ పెడ్తామని స్పష్టం చేశారు. హాస్టళ్లకు సంబంధించి అత్యవసర పనులు, రిపేర్లు వెంటనే చేపట్టాలని, ఇన్​చార్జ్ హెచ్ఎంలు ఉన్నచోట సీఆర్​టీలను నియమించాలని కలెక్టర్​కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.