బీఆర్‌‌ఎస్‌‌కు భూకేటాయింపు రద్దుపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశం

బీఆర్‌‌ఎస్‌‌కు భూకేటాయింపు రద్దుపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశం
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నెం.239, 240లో బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి 11 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని దాఖలైన కేసులో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి ఆదేశించింది. 

నాలుగు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేయాలని సూచించింది. ప్రభుత్వ కౌంటర్‌‌పై పిటిషనర్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మరో రెండు వారాల్లో అఫిడవిట్‌‌ దాఖలు చేయాలని పేర్కొంది. 

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో బీఆర్‌‌ఎస్‌‌ పార్టీకి 11 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2023లో ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పిల్ వేశారు. 2024లో హైదరాబాద్‌‌కు చెందిన ఎ.వెంకటరామిరెడ్డి మరో పిల్‌‌ దాఖలు చేశారు. 

వీటితోపాటు  వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు బంజారాహిల్స్, జిల్లా కేంద్రాల్లో బీఆర్‌‌ఎస్‌‌కు ఎకరా చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ వెలువడిన జీవో 966ను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ శ్రీరాములు నాయక్‌‌ మరో పిల్‌‌ వేశారు. 

ఆ మూడు పిల్స్‌‌ పై హైకోర్టు యాక్టింగ్‌‌ చీఫ్‌‌ జస్టిస్‌‌ సుజయ్‌‌ పాల్, జస్టిస్‌‌ జి.రాధారాణితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు అడ్వకేస్టు వాదిస్తూ కోకాపేటలో బీఆర్‌‌ఎస్‌‌ పార్టీ ఆఫీస్​కు నామమాత్రపు ధరకు 11 ఎకరాల భూకేటాయింపు అన్యాయమని పేర్కొన్నారు. అక్కడ మార్కెట్‌‌ ధర ఎకరాకు దాదాపు రూ.50 కోట్లు ఉందని, ప్రభుత్వం కేవలం రూ.3.41 కోట్లకే భూమిని కేటాయించిందని పిటిషనర్ల వాదన. 

సుమారు రూ.500 కోట్ల విలువైన భూమిని రూ.37 కోట్లకే ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టమని పేర్కొన్నారు. అలాగే గతంలో బంజారాహిల్స్​లో బీఆర్​ఎస్​కు కేటాయించిన స్థలంలో టీ న్యూస్​ చానెల్​ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 

రాజకీయ పార్టీకి కేటాయించిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు వినియోగిస్తున్నందున ఆ జాగాను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. 

కౌంటరు దాఖలు చేయడానికి 4 వారాల గడువు కావాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌ జనరల్‌‌ మహమ్మద్‌‌ ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ కోరారు. ఇందుకు అనుమతిచ్చిన హైకోర్టు.. ప్రభుత్వ కౌంటర్‌‌పై పిటిషనర్లు రిప్లై కౌంటర్లు వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.