- హైకోర్టు కీలక ఆదేశాలు
- తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా
హైదరాబాద్: సర్కార్బడుల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచామని తెలిపారు. మరోవైపు పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలని చెప్పారు. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. దీనికి బదులిస్తూ.. అన్ని కమిటీలు పని చేస్తున్నాయని ఏఏజీ తెలిపారు. దీంతో ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసింది.
గ్రామ పంచాయతీల విలీనానికి రూట్క్లియర్
ఓఆర్ఆర్పరిధిలోనిగ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విలీనం జరిగిందని చెప్పింది. పాలనలో భాగంగా చట్టాలను తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉందని పేర్కొంది.
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామపంచాయతీలను ఇటీవల మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. దీంతో మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీల విలీనానికి రూట్క్లియర్ అయ్యింది.