
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలని కోరుతూ జిల్లా టీఎన్జీవొస్ సంఘం అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రంరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం సెక్రటేరియెట్ లో మంత్రిని కలసి వినతి పత్రం సమర్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లా చార్మినార్ జోన్లో, మెదక్, సిద్దిపేట జిల్లాలను రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడం వల్ల ఉద్యోగులు ప్రమోషన్ల తో పాటు పలు విషయాలలో నష్టపోయారని మంత్రికి వివరించారు.
హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న సిద్ధిపేట జిల్లాను రాజన్న సిరిసిల్ల జోన్ లో కలపడం ఏరకంగా సహేతుకం కాదని, మల్టిజోన్లో లో భాగంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉద్యోగులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు తెలిపారు. చార్మినార్ జోన్ లో కలపడం వల్ల ఉద్యోగులకు
నిరుద్యోగులకు ఎంతో ఉపయోగ కలుగుతుందని దీన్ని గమనించాలని కోరారు. ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ అన్ని విషయాలు పరిశీలించి సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.