ఎస్ఎఫ్​సీ నిధులను వెంటనే విడుదల చేయాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

  • కలెక్టర్​కు సర్పంచుల వినతి

నిర్మల్, వెలుగు : గత 18 నెలలుగా నిలిచిపోయిన ఎస్ఎఫ్ సీ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిర్మల్​జిల్లాకు చెందిన సర్పంచులు బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వినతిపత్రం అందజేశారు. సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వీరేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ సీ  నిధులు గ్రామ పంచాయతీలకు జమకాకపోవడంతో సర్పంచులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. చెక్ పవర్ త్వరగా ఇవ్వకపోవడంతో రెండున్నరేండ్లుగా తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే సర్పంచుల పదవీకాలం ముగియబోతున్నందున మరో 6 నెలల వరకు గడువు పెంచి ప్రత్యేక అధికారులను నియమించే ఆలోచనను విరమించుకోవాలని వారు కోరారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం బాధ్యులు భూమేశ్, దత్తు, ముత్యం, బాపురెడ్డి, హనుమ గౌడ్, లక్ష్మి, సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సర్పంచులను స్పెషల్ ఇన్​చార్జీలుగా నియమించాలి

కుభీర్ :  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేవరకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించకుండా ప్రస్తుతమున్న సర్పంచులను స్పెషల్ ఇన్​చార్జీలుగా నియమించాలని కుభీర్​ మండల సర్పంచులు ఎంపీడీఓ లింబాద్రిని కోరారు. బుధవారం ఆయనకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, భార్యల మంగళసూత్రాలు అమ్మి అభివృద్ధి పనులు చేస్తే ఇప్పటివరకు బిల్లులు రాలేవని వాపోయారు. బిల్లులు రాక కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.

ఆరు గ్యారెంటీలు క్షేత్రస్థాయిలో విజయవంతం కావాలంటే ప్రస్తుతమున్న సర్పంచులనే స్పెషల్ ఇన్​చార్జీలుగా నియమించి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఎస్ఎఫ్​సీ నిధులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరారు. రాథోడ్ శంకర్, దత్తురాం పటేల్, మీరా విజయ్ కుమార్, అశ్విని పండిత్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.