వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లకుండా కుట్ర: పిటిషనర్ తరపు అడ్వొకేట్

వామనరావు దంపతుల హత్య  కేసు సీబీఐ చేతికి వెళ్లకుండా కుట్ర: పిటిషనర్  తరపు  అడ్వొకేట్
  • అందుకే నిందితుడు వాయిదాలు కోరుతున్నాడు
  • వామనరావు దంపతుల హత్య  కేసులో సుప్రీంకోర్టులో పిటిషనర్ తరపు అడ్వొకేట్ వాదనలు

న్యూఢిల్లీ, వెలుగు: న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేయకుండా నిందితుడు పుట్టా మధుకర్  ప్రయత్నిస్తున్నారని పిటిషనర్  తరపు సీనియర్  అడ్వొకేట్ మేనకా గురుస్వామి ఆరోపించారు. అందుకే వాయిదాలు కోరుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణిని నడిరోడ్డుపై కొందరు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ వామనరావు తండ్రి గట్టు కిషన్‌‌‌‌ రావు అదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 18న సుప్రీంకోర్టులో పిటిషన్  వేశారు. నిందితులు తనను బెదిరిస్తున్నందున విచారణ వేగంగా జరిపి దోషులను శిక్షించాలని కోరారు. గత విచారణ సందర్భంగా.. పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పుట్టా మధుకర్  కేసును ప్రభావితం చేశారని, ఆయన పేరును ఎఫ్ఐఆర్, చార్జిషీట్​లో లేకుండా పోలీసులు కేసును తప్పుదారి పట్టించారని చెప్పారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై తమకు నమ్మకం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తన వాదనలు వినాలని పుట్టా మధుకర్  ఇంప్లీడ్  పిటిషన్  వేశాడు. మరణ వాంగ్మూలంలో తన పేరు చెప్పారనేది అవాస్తవమని, తమకు సమయమిస్తే ఆ మరణ వాంగ్మూలాన్ని ట్రాన్స్ క్రిప్ట్  చేసి ఆధారాలు సమర్పిస్తామన్నాడు. ఇందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం.. 2 వారాల సమయమిచ్చింది. మరోసారి ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్  రాజేష్  బిందాల్ బెంచ్ విచారణ జరిపింది. తొలుత మధుకర్  తరఫు న్యాయవాది వాదిస్తూ..ఆర్టీఐ ద్వారా సమాచారం కోరామని, సమాచారం అందేందుకు టైమ్​ పడుతోందని చెప్పారు.

అందువల్ల మరో 2 వారాల సమయం కావాలని గత వారం కోర్టును కోరామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వడంతో.. పిటిషనర్ తరఫు అడ్వొకేట్​కు సమాచారం అందించామన్నారు. అయితే.. కిషన్ రావు తరఫు అడ్వొకేట్  ఈ వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ సీబీఐకి వెళ్లకుండా గేమ్ ప్లే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత విచారణ సందర్భంగానే కౌంటర్  దాఖలు చేసేందుకు సమయం కోరారని, మళ్లీ ఇప్పుడు సాకు చూపుతున్నారని అన్నారు. ఇరువైపు వాదనలు విన్న బెంచ్... కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.