హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చిన జీవో 33ని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషనర్లు వాదించారు. జీవో 33ని సవాల్ చేస్తూ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం కొత్తపల్లికి చెందిన నితీశ్, మరొకరు పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్ భీమపాక నగేశ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీలు, గ్రామసభతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రైవేట్ వ్యక్తులు ఎంపిక చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. అర్హులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. వాదనలు విన్న కోర్టు.. విచారణను వాయిదా వేసింది.