ఆదిలాబాద్ (ఇంద్రవెల్లి), వెలుగు: సీఎం ప్రజావాణి కింద పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రతిరోజు ప్రజావాణి కొనసాగుతోంది. ఇందులో భాగంగానే గురువారం ఇంద్రవెల్లి ఎంపీడీవో కార్యాలయంలో చేపట్టిన బహిరంగ ప్రజవాణికి కలెక్టర్ రాజర్షి షా హాజరయ్యారు. వారం రోజులుగా ప్రజావానిలో వచ్చిన అర్జీలపై విచారణ చేపట్టారు.
ఇప్పటివరకు 251 మంది దరఖాస్తులు పెట్టుకోగా 200 మంది బహిరంగా విచారణకు హాజరయ్యారు. ఒక్కో ఫిర్యాదుదారుడి సమస్యలు విన్నవిస్తుండగా సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సబ్సిడీ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. రుణమాఫీ కాలేదని, భూ పట్టా, ఆర్వోఎఫ్ఆర్ విరాసత్, ఆసరా పెన్షన్లు, విద్యుత్ సబ్సిడీ, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం రాకపోవటం వంటి సమస్యలపై దరఖాస్తులు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజావాణి మండల స్థాయిలో మన అదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభమైందని, ప్రజలు జిల్లా కేంద్రానికి, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గర్లో ఉన్న మండల కేంద్రంలో చెప్పుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్, డీఆర్డీవో రవీందర్, కిసాన్ మిత్ర రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీహర్ష పాల్గొన్నారు.