హైదరాబాద్‌లో నీళ్ల పెట్రోల్.. 25 కార్లు బ్రేక్​ డౌన్

హైదరాబాద్‌లో నీళ్ల పెట్రోల్.. 25 కార్లు బ్రేక్​ డౌన్
  • బంక్​ సిబ్బందిని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం 
  • తార్నాకలో ఆందోళనకు దిగిన బాధిత వాహనదారులు  

సికింద్రాబాద్,వెలుగు: నీళ్లు కలిసిన పెట్రోల్ కారణంగా పలు వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి.  మెకానిక్​లకు చూపించగా నీళ్ల పెట్రోల్ తో ఇంజిన్ ఆగిపోయిందని చెప్పగాఅవాక్కైయ్యారు. వెంటనే బంక్​వద్దకు వెళ్లి సిబ్బందిని నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో వాహనదారులు ఆందోళనకు దిగిన ఘటన తార్నాకలోని హెచ్​పీ బంక్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. లాలాపేట్​కు చెందిన రమేశ్ ఆదివారం హెచ్ పీ బంక్ కు వెళ్లి కారులో10 లీటర్ల పెట్రోల్​పోయించుకుని వెళ్తుండగా.. సడెన్ గా ఘట్ కేసర్ వద్ద ఆగిపోయింది. మరో వ్యక్తి ఉప్పల్​వెళ్తూ కారులో రూ.500 పెట్రోల్​కొట్టించుకోగా, హబ్సిగూడ దాటకముందే బ్రేక్ డౌన్ అయింది. ఇ

లా పలువురు వాహనాల్లో పెట్రోల్ పోయించుకుని కిలో మీటరు వెళ్లగానే సడన్ గా ఆగిపోయాయి. దీంతో  25 మంది బాధితులు పెట్రోల్​బంక్​కు వచ్చి సిబ్బందిని నిలదీయగా.. తమ ఓనర్ దుబాయ్ లో ఉంటాడని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్​బంక్​లో  మొదటి నుంచి కల్తీ పెట్రోల్​అమ్ముతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ మహంకాళి జిల్లా కార్యదర్శి మల్లికంటి వీరన్న ఆరోపించారు. బంక్​ను సీజ్​చేయాలని హెచ్​పీ కార్పొరేషన్​కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చివరకు వాహనదారుల ఆందోళనతో బంక్ మేనేజర్ స్పందించారు.  పెట్రోల్ లో వాటర్ కలిసినట్లు గుర్తించామని,  కార్లుకు రిపేరు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

వివాదాస్పదంగా బంక్ 

బంక్​లో గతంలోనూ పలుమార్లు ఇలాగే పెట్రోల్ లో నీరు రావడం, కల్తీ పెట్రోల్, మీటర్ ట్యాంపరింగ్ చేసి తక్కువ పోయడం వంటి ఘటనలు జరిగాయి. బంక్​స్థలంపైనా వివాదం చోటు చేసుకోగా.. కోర్టు నుంచి స్టే తెచ్చుకుని నడిపిస్తున్నారు. ఫుట్​పాత్​ను కూడా ఆక్రమించి బంక్​ను నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దానికి ఆనుకుని ఉన్న స్థలంలో అనుమతి లేకుండా వ్యాపారాలకు అద్దెలకు ఇచ్చారు.  బంక్​లో ఏదైనా సమస్య వస్తే .. వెళ్లి అడిగితే తమ ఓనర్ దుబాయ్​లో ఉన్నాడంటూ సిబ్బంది సమాధానం దాట వేస్తుంటారు. ఇప్పటికైనా తూనికలు కొలతల శాఖ అధికారులు స్పందించి కల్తీ పెట్రోల్, మోసాలకు పాల్పడుతున్న హెచ్ పీ  పెట్రోల్ బంక్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.